గుంటూరు: కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పిడిఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్లు బొడ్డు నాగేశ్వరరావు చిత్రంతో కూడిన ప్లకార్డులతో కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బొడ్డు నాగేశ్వరరావు తన నామినేషన్ పత్రాలను జిల్లా డిఆర్‌ఒ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రెడ్డికి అందచేశారు. దీనికి ముందు విజ్ఞాన మందిరంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కె.ఎస్.లక్ష్మణరావు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసరెడ్డి, రాము సూర్యారావు, ఐ.వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, ఎపిటిఎఫ్ (1938) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు ప్రసంగించారు. ఎపి గురుకులాలు, ఎపి సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, పాలిటెక్నిక్ అధ్యాపక సంఘం, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ అధ్యాపక సంఘాలు, మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్, మైనార్టీ టీచర్స్ అసోసియేషన్, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాలు, ప్రయివేటు టీచర్చ్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అసోసియేషన్, ఇంకా అనేక ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.