Nov 30,2020 23:22

ధర్నా శిబిరంలో బైటాయించిన నిర్వాసితులు

ప్రజాశక్తి - రాజవొమ్మంగి
సమస్యలను పరిష్కరించాలంటూ దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటిడిఎ ఎదుట ధర్నా చేశారు. తొలుత స్థానిక గురుకుల పాఠశాల నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ మీదుగా ఐటిడిఎ వరకూ గిరిజనులు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఐటిడిఎ ఎదుట గిరిజనులు, రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం సభ్యులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఝాన్సీ మాట్లాడారు. 2017లో కొండమొదలు గిరిజనులతో కుదుర్చుకున్న ఎన్‌ఒయును వెంటనే అమలు చేయాలన్నారు. వివాదాల్లో ఉన్న భూములకు సుమారు రూ.4.88 కోట్ల చెల్లింపుపై ఎసిబి విచారణ చేయాలన్నారు. మంటూరు, కొండమొదలు పంచాయతీలోని కత్తనపల్లి, కొత్తగూడెం గ్రామాలకు గిరిజనులు కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2018లో మంటూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదం సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పక్కా రోడ్లను నిర్మించాలన్నారు. పునరావాస కాలనీలను నాణ్యతతో నిర్మించాలని ఆదివాసి నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. వీరి ధర్నాకు సిపిఎం నాయకులు ఎం.వాణిశ్రీ, సింగిరెడ్డి అచ్చారావు, కె.బాప్పనదొర హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఐ.రామిరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ, నిర్వాసితులు పాల్గొన్నారు.