
ప్రజాశక్తి - పాలకోడేరు
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంటింటికీ రేషన్ పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పాలకోడేరు ఇన్ఛార్జి సివిల్ సప్లయీస్ ఆర్ఐ సురేష్ అన్నారు. రేషన్ పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ వాటిని అధిగమించి రేషన్ డీలర్లు, వాలంటీర్లు, విఆర్ఒలు, రేషన్ వాహనాల సిబ్బంది సమన్వయంతో ఇంటింటికీ రేషన్ అందిస్తున్నామన్నారు. మండల పరిధిలోని శృంగవృక్షంలోని స్టాక్డిపోలను ఆర్ఐ సురేష్ సందర్శించి తూకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు, వాలంటీర్లకు, విఆర్ఒలకు, రేషన్ వాహనాల సిబ్బందికి పలుసూచనలు, సలహాలు అందించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. సర్వర్ పనిచేయకపోవడం, లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయన్నారు. అయితే ప్రస్తుతం ఆ సమస్యలను అధిగమించామన్నారు. ప్రతీ ఇంటికి రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ సరుకులు సమయానికి అందించడంతో ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత సమర్ధవంతంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇన్ఛార్జి సివిల్ సప్లయీస్ ఆర్ఐ సురేష్, విఆర్ఒ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.