Feb 28,2021 06:43

మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ విద్యుత్‌ చట్ట సవరణ ప్రతిపాదన విరమించుకోవాలంటూ దేశవ్యాప్తంగా రైతులు దాదాపు మూడు మాసాలుగా ఉద్యమిస్తున్నారు. రైతు ఉద్యమ ధాటికి వెనక్కి తగ్గిన ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణలతో బిల్లు తీసుకురావాలన్న ప్రతిపాదనను విరమించుకుంటామని, మూడు చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలుపుదల చేస్తామని రైతు సంఘాల నేతలతో జరిగిన పదవ దఫా చర్చల్లో చెప్పింది. కాని, మరోవైపున విద్యుత్‌ చట్ట సవరణలను తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఫిబ్రవరి 17న రాష్ట్రాల విద్యుత్‌ శాఖ కార్యదర్శులతో కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌ ఈ విషయంపై చర్చించడం మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన మాటమీద నిలబడదని చెప్పడానికో దృష్టాంతం. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లులోని కొన్ని అంశాలు, ఆనాటి సమావేశంలో వ్యక్తమైన వివిధ అభిప్రాయాలను గురించి చర్చిద్దాం.
 

ప్రైవేటుకు పెద్ద పీట
ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు ప్రధానంగా ప్రైవేటు డిస్కాములకు నిర్నిబంధమైన స్వేచ్ఛనివ్వడం, జాతీయ గ్రిడ్‌కు సర్వాధికారాలు కట్టబెట్టడంపై కేంద్రీకరించింది. గతంలో తెచ్చిన 2003 విద్యుత్‌ చట్టం ప్రధానంగా విద్యుదుత్పత్తి రంగంలో ప్రైవేటుకు పెద్ద పీట వేయడం, విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు, వాటి అధికారాలు తదితర అంశాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచబ్యాంకు సంస్కరణలను ముందుకు తీసుకుపోవడానికి ఆనాటి చట్టం ఉద్దేశించబడింది. ఇప్పుడు పంపిణీ రంగంలో ప్రైవేటు శక్తుల చొరబాటుకు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి రంగంలోని కార్పొరేట్లకు మేలు చేయడానికి, తద్వారా విద్యుత్‌ సంస్కరణల్ని మరింత గట్టిగా అమలు చేసేందుకే కొత్త సవరణ బిల్లు తెస్తున్నారు.
ఇప్పటివరకు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో విద్యుత్‌ పంపిణీ చేసేందుకు ఒక డిస్కాముకు మాత్రమే రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఇఆర్‌సి) లైసెన్స్‌ మంజూరు చేసేది. ఇకపై డిస్కాములు ఇఆర్‌సి వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది. రెండు అంతకన్నా ఎక్కువ డిస్కాములు కూడా నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఆ డిస్కాం నుండి విద్యుత్‌ తీసుకొని, తిరిగి అమ్ముకున్నా వారు ప్రత్యేకించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోనవసరం లేదట. ఇంకా విచిత్రం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా విద్యుదుత్పత్తి చేసి, అక్కడే అమ్ముకుంటే వారు రిజిస్ట్రేషన్‌ కూడా చేయించనక్కరలేదట. దరఖాస్తు అన్ని విధాలా సవ్యంగా ఉంటే అది అందిన 60 రోజుల్లోగా ఆ డిస్కాంను నమోదు చేయవలసిన బాధ్యత ఇఆర్‌సిదేనని పేర్కొన్నారు. అంతేగాక 60 రోజుల్లోగా ఇఆర్‌సి నుండి ఏ సమాచారం రాకపోతే ఆ డిస్కాం నమోదు అయిపోయినట్టేనని (డీమ్డ్‌ టు బి రిజిస్టర్డ్‌) పేర్కొన్నారు.
 

బిఎస్‌ఎన్‌ఎల్‌ను జియో మింగేసినట్టు...
ఏదైనా డిస్కాం ఒక ప్రాంతంలో తన నెట్‌వర్క్‌తోగాని, అప్పటికే ఉన్న మరొక డిస్కాం నెట్‌వర్క్‌ను గానీ ఉపయోగించుకొని వినియోగదార్లకు విద్యుత్‌ సరఫరా చేయవచ్చునని సవరణ బిల్లు పేర్కొంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ రంగ డిస్కాముల మౌలిక వసతులను, నెట్‌వర్క్‌ను వాడుకొంటూ ప్రైవేటు డిస్కాం సమాంతరంగా విద్యుత్‌ అమ్ముకుంటుందన్నమాట. దీంతో నగరాలు, వాణిజ్యం, సంపన్నులు నివసించే ప్రాంతాలు వారు తీసుకొని గ్రామాలు, వ్యవసాయం వంటివి ప్రభుత్వ డిస్కాములకు వదిలేస్తారు. అలాగే అప్పటికే ఆ ప్రదేశంలో సేవలందిస్తున్న డిస్కాంకు కేటాయించిన విద్యుత్‌లో కొత్తగా నమోదైన డిస్కాముకు ఇఆర్‌సి నిర్ణయించిన వాటా ఇవ్వాలి. అయితే, ప్రైవేటు డిస్కాం కొత్తగా చేసుకున్న కొనుగోలు ఒప్పందాల్లో పాత డిస్కాముకు వాటా ఇవ్వనక్కరలేదు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల సమర్ధకులు చెప్పే 'అందరికీ సమానావకాశాలు (లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌)' అన్న నియమం అటకెక్కిపోయిందన్నమాట. ఇందులో ఒక ఘరానా మోసం దాగివుంది. ఇప్పటికేవున్న ప్రభుత్వ డిస్కాములకు కేటాయించిన విద్యుత్‌లో ప్రైవేటువారు వాటా పొందే హక్కుంది కనుక వెంటనే ఆ విద్యుత్‌తో తమ వ్యాపారం ప్రారంభించవచ్చు. సౌర, పవన వంటి సంప్రదాయేతర వనరుల నుండి చౌకగా విద్యుత్‌ లభిస్తోంది. అలాంటి వాటితో ఒప్పందం చేసుకొని, దాంట్లో ప్రభుత్వ డిస్కాముకు వాటా ఇవ్వకుండా పాత (అధిక) ధరకు ప్రైవేటు డిస్కాం వినియోగదార్లకు అమ్ముకొని విపరీత లాభాలు గడిస్తుంది. లేదా కొన్నాళ్లపాటు ప్రభుత్వ డిస్కాం కంటె చౌకగా కూడా సరఫరా చేసి, ఆ వినియోగదారులందరినీ ఆకర్షిస్తుంది. దాంతో విపరీత నష్టాల పాలై ప్రభుత్వ డిస్కాం మూతకు దారి తీయవచ్చు (జియో-బిఎస్‌ఎన్‌ఎల్‌ అనుభవం అందరికీ తెలిసిందే కదా!).
 

రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు, ఇఆర్‌సిలపైనా..
ఇప్పటివరకూ జాతీయ పవర్‌ గ్రిడ్‌ అనుసంధానంతో ఆయా రాష్ట్రాల్లోని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు (ఎస్‌ఎల్‌డిసి) వివిధ డిస్కాముల పరిధిలోని ఫీడర్లకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నిర్ణయాధికారం ఎస్‌ఎల్‌డిసి లదే. ఇకపై జాతీయ పవర్‌ గ్రిడ్‌కు నిర్నిబంధమైన అధికారాలు దఖలు పరుస్తారు. ఆయా డిస్కాములకు విద్యుత్‌ సరఫరా ఇకపై పూర్తిగా జాతీయ గ్రిడ్‌ నిర్ణయిస్తుంది. ఆయా ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయి పడ్డ డిస్కాములకు విద్యుత్‌ సరఫరా ఆపేసే అధికారం జాతీయ గ్రిడ్‌దేనని చెబుతూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రాలను ఇబ్బంది పెట్టిన విషయం చాలామందికి గుర్తుండే వుంటుంది. ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేయబోతున్నారు. ఇఆర్‌సిల ఛైర్‌పర్సన్లు, సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నియమించాలంటూ 2020 సవరణ బిల్లులో ప్రతిపాదిస్తే దాన్ని అన్ని రాష్ట్రాలూ వ్యతిరేకించాయి. తాజా సవరణల్లో నియమించే అధికారం రాష్ట్రాలకే ఉంచినా ఎలాంటి వారిని, ఎంతమందిని నియమించాలన్న అంశాలను పేర్కొన్నారు. ఇఆర్‌సిలు అనుసరించాల్సిన విధి విధానాలను కేంద్రమే రూపొందిస్తుందట! మరిన్ని నష్టకరమైన అంశాలు కూడా ఉన్నాయి.
 

రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా..
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో ఫిబ్రవరి 17న కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు బిజెపి పాలించే రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. భౌగోళిక కారణాల వల్ల ప్రైవేటీకరణ సాధ్యం కాదని హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, లడక్‌ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రాంఛైజీ వ్యవస్థను అమలు చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన పంపిణీ వ్యవస్థపై ప్రైవేట్‌ గుత్తాధిపత్యం ఏమిటని ఎపి తో పాటు కేరళ, తమిళనాడు అధికారులు వ్యతిరేకించారు. ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతాలను ప్రైవేట్‌కు అప్పగిస్తారని, దీనివల్ల తాము నష్టపోతామన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 


తమకు పోటీగా ప్రైవేటు డిస్కాములను ఏర్పాటు చేసే ప్రతిపాదనపౖౖె ఇంకొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా కేంద్ర మంత్రి వినిపించుకోలేదు. పైపెచ్చు వినియోగదారుడికి డిస్కాంలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడానికి మీరు వ్యతిరేకమా అంటూ రాష్ట్రాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం దారుణం. టెలికాం సెక్టార్‌ ప్రైవేట్‌ పరం చేసినట్టే విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని, ప్రైవేట్‌ కంపెనీలకు అవసరమైన నెట్‌వర్క్‌, లైన్లు అంతా కూడా డిస్కాముల నుంచే వాడుకుంటాయని గట్టిగా చెప్పారట. ఇందుకు కొంత నగదు ప్రైవేట్‌ కంపెనీలు డిస్కాంలకు చెల్లిస్తాయని ఊరడించడం ఘోరం. ఉద్యోగులు, క్రాస్‌ సబ్సిడీ వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తిన వాటికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదు.
 

అంతా ఏకపక్షం
ఈ బిల్లు రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులు, విద్యుత్‌ రంగ నిపుణులు, ఇంజినీర్లు, ఉద్యోగులను విస్మరించింది. వారి స్పందనలు తీసుకునేందుకు ఈ బిల్లును కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని డిమాండ్‌ చేస్తున్నా అది అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. డిస్కామ్‌లకు పోటీగా ప్రైవేటీకరణ సమాంతర లైసెన్స్‌ తీసుకురావడం వల్ల ఆశించిన ఫలితాలకు విరుద్ధంగా జరిగినట్లు పూణెకు చెందిన ప్రముఖ సంస్థ 'ప్రయాస్‌ గ్రూప్‌' అధ్యయనం స్పష్టం చేసింది. ఈ విధానం వల్ల వినియోగదారులపై అధిక భారాలు పడ్డాయని, నియంత్రణ వైఫల్యం చెందిందని, అనవసరమైన ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. ఒడిశా, ఢిల్లీలో ఇలానే జరగడంతో ఆ రాష్ట్రాలు వ్యతిరేకించాయి.


వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు వ్యతిరేకించినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టం కావడంలేదు. వైసిపి అధికారానికి వచ్చీ రాగానే పిపిఎలను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పినా ఆ తరువాత వెనక్కు తగ్గారు. గతంలో ఇఆర్‌సి నియామకం వంటి అంశాల్లో కేంద్ర ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించినా, జాతీయ గ్రిడ్‌ పెత్తనాన్ని అంతగా ప్రతిఘటించలేదు. డిస్కాముల మౌలిక వసతులను, నెట్‌వర్క్‌ను ప్రైవేటువారు సమాంతరంగా వాడుకోవాలన్న అంశాన్ని ఉద్యోగుల మొదలు ఉన్నతాధికారుల వరకూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్‌ రంగానికి తీవ్ర హానికరమైన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘటించాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.
                                                                           * బి. తులసీదాస్‌