Oct 03,2021 13:24

ర్మపురి జమీందారు సోమేశ్వర భూపతికి తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ అతని వంశంలో ఆఖరివాడుగా మిగిలిపోవడం వల్ల ఆలోచనలో పడ్డాడు. దీంతో ఆస్తిని తన తదనంతరం ఈ ధర్మపురి ప్రజల కోసం ఖర్చు పెట్టాలనుకుంటాడు.
ధర్మపురి కౌముది నదీ తీరాన ఉండడంతో ప్రతి ఏటా కురిసే వర్షాలకు వరదలు సంభవించి రైతులు పంటలకు, చిరు వ్యాపారులకు నష్టం కలుగుతుండేది. దీన్ని గ్రహించి వెంటనే సోమేశ్వర భూపతి తన వద్ద దివాన్‌గా పనిచేసే వివేకవర్ధనుడిని పిలిచి 'దివాను గారూ! మన ధర్మపురి ప్రజలు ఏటా వర్షాల వల్ల, వరదల వల్లా నష్టపోతున్నారు. వీరందరికీ ఏదో విధంగా సహాయం చేయాలి. నా తదనంతరం ఈ ఆస్తితో ధర్మపురి ప్రజలంతా సంతోషంగా గడపాలి. దీనికి మీరు సలహా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను' అన్నాడు.
వివేకవర్ధనుడు కాసేపు మౌనంగా ఆలోచించి 'అయ్యా! తమ ఆలోచన సబబుగానే ఉంది. అయితే నాదో చిన్న మనవి. మన ధర్మపురి ప్రజల జీవన విధానాన్ని అనుసరించి, మూడు భాగాలుగా విభజిస్తే మొదటి వర్గం వారు వ్యవసాయం చేసుకునేవారు, కూలీలు, చిరు వ్యాపారులు. రెండో వర్గం వారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, చేతి వృత్తులు చేసుకునే మధ్యతరగతి వారు. ఇక మూడో వర్గానికి చెందిన వారు పట్నంలో వ్యాపారాలు చేసుకుని, ఇంతో అంతో కూడబెట్టుకుని సుఖ జీవనం గడుపుతున్న గొప్పవారు. మూడు వర్గాల వారిని పిలిచి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, వారికి మీ సహాయం అందిస్తే బాగుంటుందని నా సలహా' అన్నాడు.
'దివానుగారూ మీ ఆలోచన బాగున్నది. రేపే వారి తరపున ఒక్కొక్కరినీ పిలిపించండి' అని చెప్పాడు.
రెండోరోజు జమీందారు దగ్గరికి ముగ్గురినీ తీసుకొచ్చాడు. జమీందారు వారిలో మొదటి వర్గానికి చెందిన రైతును పక్కకు పిలిచి, తనకున్న కష్టాలు చెప్పమన్నాడు. రైతు 'అయ్యా! మేము ప్రతి ఏటా వచ్చే వర్షాలకు, నది పొంగి వరదల వల్ల పంట నష్ట పోవడం, దానివల్ల రైతుకూలీలకు, చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగడం, పెట్టిన పెట్టుబడులుకి గిట్టుబాటు రాకపోవడం వల్ల అనేకవిధాల బాధపడుతున్నాం' అన్నాడు. అతన్ని పంపేసి రెండో వర్గానికి చెందిన వ్యక్తిని పిలిచి, కష్టసుఖాలు చెప్పమనగా... 'అయ్యా! మేము చేసుకుంటున్న చిన్నవ్యాపారాలతో ఎలాగో సర్దుకుని, మా కుటుంబాలని గట్టెక్కించుకుంటూ సంవత్సర కాలం గడిచినా అవసరాలకు, ఆరోగ్యపరమైన వాటికీ కొంత ఇబ్బంది తప్పడం లేదు' అని చెప్పాడు. అతన్ని పంపేసి మూడో అతన్ని పిలిచి తన కష్టసుఖాలు అడుగగా 'అయ్యా! మేము పట్నంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగానే జీవిస్తున్నాం. అయితే పట్నంలో రోజుకో కొత్త వ్యాపారం పుట్టుకొచ్చి, ఇబ్బంది పెడుతున్నాయి' అన్నాడు.
అతన్నీ పంపేసిన సోమేశ్వరభూపతి 'దివాన్‌ జీ.. ఇప్పుడు ఈ మూడు వర్గాల వారి కష్టసుఖాలనూ విన్నారుగా వీరిలో ఎవరికి సహాయం చేయాలో మీ అభిప్రాయం చెప్పండి' అనగానే 'అయ్యా! మొదట రైతులు చెప్పినట్లు వాళ్లకి కష్టాలు ఎక్కువ కనుక వారికి ఎక్కువ భాగం సహాయం చేయాలి. ఇక రెండో వర్గానికి చెందిన వారికి మొదటి వర్గాని కంటే తక్కువ భాగం సహాయం చేయాలి. పోతే మూడో వర్గానికి ఎటూ వ్యాపారాలు ఉన్నాయి. ఏ లోటూ లేకుండా బతుకుతున్నారు. వారికి అంతగా సహాయం అవసరంలేదు. అయితే ధర్మపురి ప్రజలందరికీ ఏదో ఒకవిధంగా వరదల వల్ల నష్టం కలిగించే నదికి ఆనకట్ట కట్టి, వరదలను అరికడదాం. వ్యవసాయ సాగు కోసం నీటిని అందిస్తే చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెంది, అందరికీ మేలు జరుగుతుంది' అన్నాడు.
సోమేశ్వరభూపతి 'దివాన్‌ జీ.. మీ ఆలోచన నాకు బాగా నచ్చింది. అలాగే చేస్తాను' అన్నారు. తన ఆస్తిని మొదటి రెండు వర్గాల వారికీ, నదికి ఆనకట్ట కట్టడానికి నిధులు కేటాయించి, మిగిలిన ధనంలో కొంతభాగం తన తదనంతరం దివాను బాగా బతికేందుకు తగిన విధంగా వీలునామా రాయించాడు.
జమీందారుకి ధర్మపురి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆనకట్ట పూర్తయ్యింది. శిలాఫలకంపై 'సోమేశ్వర ఆనకట్ట'గా పేరు చెక్కించారు. భూపతి మరణించినా అతను చేసిన మంచి పనులకు అతని పేరు కలకాలం ధర్మపురి ప్రజలు తలచుకుంటూ జీవించసాగారు.
 

కంచనపల్లి ద్వారకనాథ్‌
99852 95605