Apr 14,2021 21:41

గూడూరు/దొరవారిసత్రం/ వెంకటగిరి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే సిపిఎం అభ్యర్థి ఎన్‌.యాదగిరిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు ప్రజలను కోరారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బి.సి కాలనీలో అరుంధతీయవాడ ఏరియాలలో జరిగిన ప్రచారంలో ఉమామహేశ్వరరావు పాల్గని మాట్లాడారు. ఢిల్లీలో గత ఆరు నెలలుగా వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు నల్లధనాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చి ఏడేళ్లు అవుతోందని, నల్ల ధనాన్ని తీసుకురాకపోగా పెద్ద నోట్ల రద్దు పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసి వారి ప్రాణాలను తీశారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే సిపిఎంకు ఓటు వేయాలని కోరారు. గూడూరు, దొరవారిసత్రం, వెంకటగిరి, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి పర్యటించారు. వెంకటగిరిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనలక్ష్మీ ప్రచారంలో పాల్గన్నారు. యాదగిరి గెలుపు కోసం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేదల పక్షాన సిపిఎం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. దొరవారిసత్రం మండలంలోని పూలతోట, మేల నలత్తూరు గ్రామాలలో యాదగిరిని గెలుపు కోరుతూ డివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు వై.రాము, నాయకులు ఆలూరు తిరుపాలు, చాపల వెంకటేశ్వర్లు, చాపల దాము, తుమ్మ అనిల్‌ పాల్గొన్నారు.