Nov 22,2020 19:03

విశాఖపట్నంలో సినీ హబ్‌ ఏర్పాటుపై అనేకమార్లు చర్చ జరిగినా... ఇప్పటివరకు ఆ దిశగా అందుకవసరమైన అడుగులు పడలేదు. అక్కడ సినీ స్టూడియోలు, ప్రొడక్షన్‌ హౌస్‌లు నిర్మించేవారికి అవసరమైన సౌకర్యం కల్పిస్తామని ఇప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ, తగు చర్యలు ఇప్పటివరకూ తీసుకోలేదు. 'మరో చరిత్ర', 'నాలుగు స్తంభాలాట', 'మహర్షి' 'శ్రీవారికి ప్రేమలేఖ', 'స్వర్ణకమలం'... వంటి విజయవంతమైన సినిమాలు విశాఖ పరిసరాల్లోనే చిత్రీకరింపబడ్డాయి. అభిలాష, సుస్వాగతం, శివమణి, ఆర్యా, మల్లీశ్వరి, ఓరు..!, నిన్నుకోరి, బుజ్జిగాడు, సోలో, నేనుశైలజ, జులాయి, మజిలీ వంటివి ఎన్నో చిత్రాల్లోని... సన్నివేశాల్ని వైజాగ్‌ మార్కెట్‌ల్లో, వీధుల్లో, సముద్ర తీరం వద్ద, ఆ పరిసరాల తోటల్లో చిత్రీకరించారు. ఇంకా ఎన్నో సినిమాలకు విశాఖ అందాలు ప్రాణం పోశాయి.

విశాఖపట్నంలో సినీ హబ్‌
ఆంధ్రా ఊటీగా పిలువబడే లంబసింగి, అరకు షూటింగ్‌లకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. సినిమా షూటింగులకు అనుకూలంగా ఉండే పచ్చటి తోటలు, జలపాతాల సందళ్లు, తీరప్రాంతం, మట్టి దిబ్బలు, ఆహ్లాదపరిచే ఎత్తైన ప్రదేశాలు, చిక్కటి అడవులు, కొండలు, గుట్టలు... ఇలా ప్రకృతి దృశ్యాలు సినిమాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కైలాసగిరి, రామకఅష్ణ బీచ్‌, జులాజికల్‌ పార్క్‌, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్‌, యారాడ కొండ సినీ ప్రేమికులను కనువిందు చేసేవే! అంతటి అనుకూల ప్రదేశంగా ఉన్న విశాఖపట్నం సిని పరిశ్రమకు అనువైన చోటు. కోట్లు ఖర్చు చేయకుండానే, భారీ సెట్లను నిర్మించనక్కరలేకుండానే సహజసిద్ధమైన లకేషన్లతో ఫీల్‌గుడ్‌ చిత్రాలను సినీ ప్రేమికులకు అందించవొచ్చు. 'గోదావరి' చిత్రాన్ని పూర్తిగా గోదావరి నదిపై, పట్టిసీమ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రకృతి శోభాయమానంగా తీసిన చిత్రాన్ని ప్రేక్షకులూ ఎంతగానో ఆదరించారు. ఇటీవల వచ్చిన 'ఓ పిట్టకథ' చిత్రం పూర్తిగా కోనసీమ స్థానికతతో... తెరకెక్కించారు. స్థానిక కథాంశాలతో 'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రాన్ని వైజాగ్‌, అరకు, సింహాచలం, అన్నవరం కొండ, భీమిలి బీచ్‌ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. కాని ఆహ్లాదపరిచే ప్రకృతి దృశ్యాల కోసం సినీ దర్శకులు విదేశాలకు వెళ్తున్నారు.

సినీసీమకు విశాఖ స్వాగతం
          అటు ఉత్తరాంధ్ర నుంచీ, కోనసీమ వరకూ లోకేషన్లపరంగానూ, కళాకారులు, చిత్ర నిర్మాతల పరంగా ఎటువంటి కొరత లేదు. ఇటీవల అనేక సినిమాలను నూతన దర్శకులు తక్కువ బడ్జెట్‌తో... స్థానిక లకేషన్లలో చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించారు. వైజాగ్‌, భీమిలి, అరకులోయలు, కోనసీమ, రంపచోడవరం ప్రాంతాలను మాత్రమే ఉపయోగించుకొని విజయవంతం అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో విశాఖ కేంద్రంగా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తే ఇటు రాష్ట్రానికి, అటు సినీ రంగానికీ మేలు చేకూరుతుంది. అనుబంధ రంగాల్లో ఎందరో కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్థానికంగా ఎందరో కళాకారులు వెలుగులోకి వస్తారు. పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వమూ ఆదిశగా ఆలోచనలు చేయాలి. మాటలను దాటి ఆచరణలో ముందడుగు వేయాలి.