Oct 24,2020 18:44

ప్రతి క్షణం..
నీ కోసం స్వప్నాల
సుమవాటికలో
కోర్కెలు జాలువారే
కాంతిపుంజంలా
నిరీక్షిస్తూనే వున్నా..
నాడు
నువ్వు నాటిన ప్రేమ బీజాలు
పెరిగి వటవృక్షాలై వాత్సల్య నీడనిస్తాయని
ఆశపడ్డాను..
కానీ, నేడు
ఊడల చేతులు చాస్తూ
శూన్య వీధుల్లో
నిశ్శబ్ధ సంధ్యా నిశీధుల నడుమ
ముఖాన్ని మూసుకొని
మూగగా రోదిస్తున్నాయి..
అంతరాంతరాలలో
ప్రతిధ్వనించే
ఒక్కో తలపు చారికలు
పవన శారికలై పలకరిస్తున్నట్టున్నాయి..
అనుక్షణం నీ ఆలాపనలో ఉన్నందునేమో
ఏ అలికిడి విన్నా
నీ అడుగుల సవ్వడిలా వినిపిస్తోంది..
ఎప్పటికైనా దారి తప్పి
ఇటు రాకపోతావా
అనే ఆశతో
శిలలా వేచియున్నా!!
-సుజాత.పి.వి.ఎల్‌.
[email protected]

 

kavitha 22

అంతర్ముఖం

అసహనంతో....
మనసు....వేగుతోంది!
పూయించక
తప్పని దరహాసం!!

నువ్వు లేక..
నేను లేను!!
ఏ యుగానికైనా
నిలిచే
అబద్ధమిదొక్కటే!!

తేనె చినుకులు
ఆ పలుకులు!!
వెలుగులో
చూశామా...??
గోముఖవ్యాఘ్రమే!!

బిడ్డ పిలుపంతా...
ఆప్యాయతే!
విల్లు వ్రాసేస్తే..
అంతా గల్లంతే!!

స్నేహమేరా
జీవితం!!
ఇచ్చి,
పుచ్చుకోవడంలో..
తేడారాకుంటే నిజమే!

ఎటు చూసినా....మేలి
ముసుగులే!!
లోని వాసన
రాకుండా..
మాటల అత్తర్లు!!
- సుభాషిణి ప్రత్తిపాటి
[email protected]

 

అకాల వర్షం !
ఆరుగాలం శ్రమంతా
కంటి చెలమలో పడి తడిసింది
కోతలకు ముందే గుండెకోత
మిగిలింది
వరాల వరిచేను కన్నీట మునిగింది
పచ్చదనం వెచ్చని బువ్వ
అవ్వకముందే
వరుణుడు ఉరిమి వర్ణచిత్రంపై
వర్షమై కురిసాడు
ఇదేం వానయ్యా !
దున్నినపుడు దయ లేదు
నాట్లప్పుడు నవ్వు లేదు
కోతకొచ్చేకా ఈ గుండెకోత?
గుండెలు బాదుకొంటే పోతాదా
ఈ దండగంతా..
ఏరువాక నాటి పున్నమిలా మురిపిస్తే
ఆరుగాలం దాటిన అమాసలా
ఏడిపించింది
కనుచూపు మేర కళింగయుద్ధంలా
కకావికలమైన పంట
రైతుకళ్ళల్లో వర్షమైంది
చెమట మట్టిని బంగారం చేస్తే
వర్షం బంగారాన్ని మట్టిపాలు
చేసింది..
మట్టిలోంచి మాణిక్యాల్ని వెలికితీసే
అన్నదాత ఇపుడు తడిసిన కంకుల్ని
అలసిన గుండెలపై మోస్తున్నాడు.. !
- భీమవరపు పురుషోత్తం
9949800253

 

జడలు విప్పిన ఆకాశం

ఆకాశం ఇప్పుడు జడలు విప్పిన
మర్రిచెట్టులా ఉంది
మేఘాలను పాదాక్రాంతం చేసుకుంది
ఉరుములు మెరుపులు ఊరు చివర
ఊడలతో కలిశాయి
నేలను ఆక్రమించినప్పుడు ఆకాశం
అడ్డుకోలేదు
నీళ్ళను కాలుష్యం చేసినప్పుడు నది అడ్డు
రాలేదు
నాలాలు కబ్జా చేసినప్పుడు రోడ్డు
అడ్డుకోలేదు
చెరువులు ఆక్రమించినప్పుడే
చిక్కంతా వచ్చింది
తన అస్థిత్వానికి ముప్పు ఏర్పడిందని
వాపోయింది
దారులన్నీ మూసుకున్నచోట
ఆకాశం ఉగ్రరూపం దాల్చింది
నడిచే దారిని మూసేస్తే మరో దారి
చూసుకుంది
మేఘాలతో స్నేహం చేసి
మనిషి మీద పంజా విసిరింది
నదులు వాగుల్ని ఏకంచేసి ఊళ్ళ మీదకి
ఉసికొల్పింది
నడిచే దారుల్లో ముళ్ళు పరచినట్టు
నగరాల్లో నాలాలు లేక
నీటి ఉధృతి రోడ్లమీద పారింది
చెట్టు చేమలు ప్రవాహంలో
కొట్టుకుపోయినట్టు
ఇక్కడ మనుషులు నీళ్ళల్లో
కొట్టుకుపోతున్నారు
ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇళ్ళు
కళ్ళముందు అస్థిపంజరాల్లా తేలుతున్నాయి
కెరటాలు విరిగిపడుతున్న సముద్రంలా
ఉంది నగరం
బతుకంతా నీళ్ళలో కొట్టుకుపోయాక
మనిషి కళ్ళల్లో కన్నీళ్ళే మిగిలాయి
మనుషులంతా చెల్లాచెదురయ్యాక
నీళ్ళిప్పుడు పండుగ చేసుకుంటున్నాయి
ఆకాశం నగరం నడిబొడ్డున సముద్రాన్ని
ఆవిష్కరించింది
ఇప్పుడు చేపలన్నీ ఇళ్ళల్లోకి
మనుషులంతా వీధుల్లోకి
మనిషి ఎప్పుడు సవ్యంగా ఉండడు
అపసవ్యమే అతని చిరునామా
బతుకే నీళ్ళల్లో కొట్టుకుపోయాక
మనిషి కళ్ళల్లో మిగిలేవి కన్నీళ్ళే
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని
కార్చడానికి ఇప్పుడు కన్నీళ్ళు కూడా లేవు
- చొక్కర తాతారావు
6301192215