Jan 10,2022 07:19

'సృజనాత్మకత' అనే పదం ఒకటుండేది. అదిప్పుడు మరుగున పడిపోయింది. 'సెల్‌'నాత్మకత' అనేది ఒకటి పుట్టుకొచ్చి, సజనాత్మకతను అమాంతం మింగేసి, 'వాతాపి జీర్ణం' అనకుండానే సమస్త మానవాళినీ తన గుప్పిట్లోకి తీసుకుంది. నలభై దాటిన వాళ్లు ఓసారి కళ్లు మూసుకుని తమ బాల్యంలోకి ప్రయాణం కడితే... కళ్ల ముందు అపురూపమైన దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, మట్టిబొమ్మలు, బొంగరాలాట, గోలీలాట, కుందుళ్లు, బచ్చాలాట, ఏడుపెంకులు, కాల్వలో ఈతలు, పండ్లతోటల్లో దొంగతనాలు, పొలం పనులు, గేదెల్ని మలేయటాలు... ఇట్లా ఆటపాటలూ ముద్దుముచ్చట్లూ అనేకం గుర్తుకొస్తాయి.
ఈ కార్యకలాపాలన్నిటి ద్వారా పిల్లల్లో దాగి ఉండే సృజనశక్తులు పురి విప్పుతాయి. సరికొత్త ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి. మేధాశక్తి వికసిస్తుంది. పిల్లల్లోని ఆ మేధస్సును తొట్టతొలిగా గుర్తించి, ప్రోత్సహిం చి, అభినందించే మానవీయమూర్తి గురువు.
అలాంటి గురువుల ప్రతినిధి సమ్మెట ఉమాదేవి. ప్రముఖ రచయిత్రిగా పేరొందిన ఉమాదేవి రెండు దశాబ్దాలకుపైగా ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె ఒక ఉద్యోగి లా బడికి రాకపోకలు సాగించలేదు. ఒక మాతృ మూర్తిలా తరగతి గదిలో కాలు పెట్టారు. పిల్లల్ని ప్రేమించారు. ఆదరిం చారు. అక్కున చేర్చుకున్నారు. వారితో మమేకమ య్యారు.
కేవలం పాఠాలకే పరిమితం కాకుండా పిల్లల బాగోగులు పట్టించుకున్నారు. వారి జీవన మూలాల్లోకి తొంగి చూశారు. వివిధ ప్రాంతాల్లోని పిల్లల 'ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో- వారి విద్యా సామర్థ్యాలలో, సౌకర్యాలలో- వారి భాషలో, భావ వ్యక్తీకరణలో, ఆత్మవిశ్వాసంలో, మొత్తం జీవన విధానంలో ఉన్న వ్యత్యాసాన్ని' ఆకళింపు చేసుకున్నారు. కొన్ని అంశాలు ఆమెకు అంతులేని సంతోషం కలిగిస్తే, మరికొన్ని కలవరం కలిగించాయి. కొన్ని విషయాలు గర్వం కలిగిస్తే, మరికొన్ని కంటతడి పెట్టించాయి. రచయిత్రి కాబట్టి ఆయా సందర్భాలకు అక్షరాలతో ప్రాణం పోశారు. దానికి 'మా పిల్లల ముచ్చట్లు' (ఒక టీచర్‌ అనుభవాలు) అనే హాయిగొలిపే శీర్షికతో పాఠకులకు అందించారు.
పిల్లల జీవన మూలాలు, వారి అల్లరి చేష్టలు, ఆర్థిక అసమానతలు తదితర అంశాలను గంభీర సాహిత్య శిల్పంతో అక్షరీకరించి ఉంటే ఈ పుస్తకం పాఠకుల్ని ఇంతగా ఆకట్టుకోగలిగేదికాదు. పిల్లల మాటలతో, చిన్నచిన్న ముచ్చట్లతో, సరళమైన వాక్యాలతో గుదిగుచ్చారు. క్లుప్తత- ఈ కదంబాలకు సొగసులద్దింది. 'పిల్లలున్నప్పుడే బడి చైతన్యమందిరమౌతుంది' అన్న జేగంటతో మొదలైన ముచ్చట్ల పరంపర తన 'ఉద్యోగ విరమణానంతర యానం' సంగతులతో ముగుస్తుంది.
258 పేజీల్లో 220 అంశాలుగా విస్తరించిన ఈ ముచ్చట్లలో తొలి అర్ధభాగంలో పిల్లల అల్లరి, వాళ్ల హాస్య చతురత, సృజనాత్మక నైపుణ్యం, కళలు, సాంస్కృతిక అంశాలను ఉమాదేవి అంతర్దృష్టితో వీక్షించి విశ్లేషణాత్మకంగా అక్షరబద్ధం చేశారు. వానలు, వనభోజనాలు, కొత్త పుస్తకాలు, వినాయక సంబరాలు, బతుకమ్మ ఊరేగింపులు, జెండా పండుగలు, పుట్టినరోజులు, పర్వదినాలు, సీమంతాలు, సెలవులు, చెవిపోగులు, ఊతపదాలు, దాగుడుమూతలు, పల్లెల్లో ఎన్నికలు... ఇట్లా ఆహ్లాదకర సందర్భాలను పిల్లల కోణంలోంచి అద్భుతంగా క్రోడీకరించారు.
                                                                     *********
పుస్తకం రెండో భాగంలో రచయిత్రి మేధామథనం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధికి అల్లంత దూరంలోనే ఆగిపోయిన గిరిజన తండాల్లోని పాఠశాలల్లో పనిచేసిన కాలంలో ఎన్నో సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. వాటి గురించి సామాజిక కోణంలోంచి ఆలోచించి, ప్రభుత్వానికి లేదా అధికారులకు విలువైన సూచనలు చేశారు.
అందరు టీచర్లలాగే ఉమాదేవి కూడా ఓరోజు పిల్లల్ని 'మీరేం కావాలనుకుంటున్నారు?' అని అడిగారట. అత్యంత సహజంగానే వారి నోట డాక్టర్‌, యాక్టర్‌, కలెక్టర్‌, ఇంజినీర్‌, పైలెట్‌ వంటి మాటలు వెలువడ్డాయి. కానీ, ఓ కుర్రాడు 'పెద్దయ్యాక నేను మా నాన్నను చంపేస్తాను. ఎందుకంటే రోజూ బాగా తాగొచ్చి మా అమ్మనూ, నన్నూ మస్తు కొడుతుండు' అని చెప్పాడు. ఆ సమాధానంతో షాక్‌ తిన్న రచయిత్రి కళ్లముందు క్యుములేటివ్‌ రికార్డులు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, కులం, వయసు, భాషల వివరాలు మాత్రమే రాస్తారు. అంతకుమంచి ఉండాల్సినదేమిటో రచయిత్రి స్పష్టంగా చెప్పారు. 'పిల్లల కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, శారీరక స్థితి... ఇవన్నీ ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి. అప్పుడే వారి వ్యక్తిగత సమస్య, సామర్థ్యాలకు అనుగుణంగా బోధించగలుగుతారు' అంటారు. క్యుములేటివ్‌ రికార్డులు ఎలా ఉంటే బాగుంటుందో వివరించారు. ప్రభుత్వం పాటిస్తే విద్యావ్యవస్థకే గొప్ప మేలు జరుగుతుంది.
తల్లికి క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం రచయిత్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఓ పాప ఫోన్జేసి 'నేనెట్ల బతికేనూ మేడమ్‌?' అని వాపోయినప్పుడు ఆమె స్పందించిన తీరు ప్రశంసనీయం. పైల్స్‌ సమస్యతో ఆ పాప పడుతున్న బాధలు, పరిష్కారం కోసం ఉమాదేవి స్పందించిన తీరు చదివి తీరాల్సిందే. మరో ముచ్చటలో బాలికల లోదుస్తుల సమస్యను చర్చకు పెట్టారు. ఇలాంటి విషయాలను క్లుప్తంగా వివరించి, ఆ పరిస్థితుల మెరుగుదలకు విలువైన సూచనలందించారు.
జ్యోతి తెలివైన పిల్ల. ఆరో తరగతిలో హఠాత్తుగా బడి మానేసింది. టీచర్‌ ఆరా తీసింది. ఆ పాపకు తమ్ముడు పుట్టాడు. సబ్‌ జైల్లో చిరుద్యోగం చేస్తున్న తల్లి మెటర్నిటీ లీవ్‌ అయిపోయింది. జీతం రాకపోతే సంసారం సాగదు. పరిస్థితిని అర్థం చేసుకున్న జ్యోతి బడి మానేసి, తమ్ముడి బాధ్యతను తీసుకుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ బడికొచ్చిన జ్యోతి మేధస్సులో అదే చురుకుదనం. టీచర్ల సహకారంతో మళ్లీ పుంజుకుని పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చింది. ఇలాంటి విజయగాథలెన్నిటికో రచయిత్రి ప్రత్యక్ష సాక్షి. అదే సమయంలో వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను ఎత్తిచూపారు. 'పిల్లలకు మధ్యాహ్నం అన్నం పెట్టాలని తీర్మానించిన ప్రభుత్వం కంచాలు, గ్లాసులు ఎందుకివ్వదు?' అని 'కంచం-గ్లాసు'లో సూటిగా ప్రశ్నించారు. కంచం తెచ్చుకోని ఓ పిల్లాడికి మరో విద్యార్థి తన కంచం ఇవ్వటానికి నిరాకరించటం వెనక దాగి ఉన్న సామాజిక అంతరాన్ని మరో ముచ్చటలో ఆర్ద్రంగా స్పశించారు.
కథల ద్వారా పిల్లల్లో ఆలోచనాశక్తిని పెంచవచ్చనేది జగమెరిగిన సత్యం. అది ఆచరణలో అడుగున పడిపోవటమే వర్తమాన సామాజిక విషాదం. 'స్వయంసిద్ధ ఎలుక'ను రచయిత్రి వైవిధ్యంగా చిత్రించారు. 'శిక్షలు, దండన'ల ప్రభావం ఎలా ఉంటుందో పరామర్శించారు. 'వ్యాసరచన' ద్వారా పిల్లల్లో కలిగే మానసిక వికాసాన్ని సోదాహరణంగా వివరించారు. విద్యార్థినులు బడి మానేయటం వెనక పైకి కనిపించే కారణాలు అత్యంత సాధారణంగా ఉంటాయి. తరచి చూస్తే ఎన్నో గాయాలుంటాయి. విషాదభరిత కారణాలుంటాయి. 'ఓ అమ్మాయి బతుకు నడక' గురించి రాసిన ముచ్చట చదివితే హృదయం ద్రవించిపోతుంది.
'కొన్ని బాధపడ్డ సందర్బాలు' తన మనసునెలా మెలిపెట్టాయో రచయిత్రి చలించిపోయి రాశారు. ఎర్రటి ఎండలో మిరపకాయల కుప్పల్లోంచి తాలుకాయలు ఏరుతున్న ఇద్దరు విద్యార్థినుల్ని చూసినప్పుడు ఎంతగా తల్లడిల్లిపోయారో వివరించారు. ప్రభుత్వం పిల్లలకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌ అందిస్తోంది. వానలు గట్రా వచ్చినప్పుడు ఉతుక్కోవటం కష్టం. ఇంకో జత ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇట్లా చెబితే అందులో విశేషమేమీ ఉండదు. పదో తరగతి పాసై వెళ్లిపోతున్న అమ్మాయిలు వచ్చి 'మేడమ్‌, మీకో చిన్న గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నాం. మీకేమి ఇష్టమో చెప్పండి' అని అడిగినప్పుడు 'మీకిక యూనిఫామ్‌తో పనుండదు. నాకిచ్చేయండి. మీ జూనియర్స్‌కు ఉపయోగపడతాయి' అని ఉమాదేవి కోరినప్పుడు విశేషానికి విలువైన అర్థమేమిటో బోధ పడుతుంది.
                                                                      *********
మొత్తంగా ఇవన్నీ ఒక టీచర్‌ అనుభవాలు మాత్రమే కాదు. సిలబస్‌లో చేర్చాల్సిన పాఠాలు. పుస్తకాల్లో కలపాల్సిన అధ్యాయాలు. విద్యావ్యవస్థను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దాలని ఒక సాధారణ ఉపాధ్యాయురాలు బల్ల గుద్ది మరీ చెప్పిన అమూల్యాంశాలు. టీచర్‌ కేవలం పాఠాలు బోధించటానికే పరిమితం కాకుండా, ఒక కేర్‌టేకర్‌లా వ్యవహరించినప్పుడే విద్యార్థుల సమగ్ర వికాసం సాధ్యమవు తుందని ఈ పుస్తక సారాంశంగా అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల చైతన్యం, సహౌపాధ్యాయుల సహకారం, గ్రామపెద్దల అండ, విద్యాధికారుల ప్రోత్సాహం... వీటన్నిటినీ సమన్వయం చేయటంలోనూ టీచర్‌ తనవంతు పాత్ర పోషించాలని విలువైన సందేశం అందించిన సమ్మెట ఉమాదేవి గారు అభినందనీయులు.
ఈ పుస్తకాన్ని పిల్లల కన్నా ముఖ్యంగా పెద్దలు చదవాలి. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠ్యపుస్తకాల రూపకర్తలు చదవాలి. చదివి, వెంటనే మర్చిపోకుండా సాధ్యమైన సవరణల కోసం... కొండొకచో సమూల మార్పుల కోసం ఎవరి పరిధిలో వారు కృషి చేసినప్పుడే రచయిత్రి తపనకు కాస్తయినా ఉపశమనం దొరుకుతుంది.
'శాంతా వసంతా ట్రస్టు' ప్రచురించిన ఈ విలువైన పుస్తకానికి ప్రముఖులు వరప్రసాద్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఏనుగు నరసింహారెడ్డి, దేవినేని మధుసూదనరావు, శివా జాస్తి, కందుకూరి రాము గార్లు విలువైన ముందుమాటలు రాశారు. మొదటి ప్రచురణ కాపీలు అయిపోవటం ఈ పుస్తకానికి లభించిన గుర్తింపునకు నిదర్శనం. రచయిత్రే స్వయంగా రెండో ప్రచురణ బాధ్యతలు స్వీకరించటం బాధ్యతయుతమైన సాహసోపేత చర్య. పుస్తకాన్ని కొని చదవటమే (ప్రతులకు రచయిత్రి : 98494 06722) ఆమెకు మనం చేసుకునే సత్కారం. ముఖచిత్రం మొదలు లోపలి పేజీల్లో వాడిన వందల చిత్రాలన్నీ ఉమాదేవి గారి అనుభవాల తాలూకు జ్ఞాపక చిత్రాలే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదివి తీరాల్సిన మంచి పుస్తకం 'మా పిల్లల ముచ్చట్లు'.

                                               - ఎమ్వీ రామిరెడ్డి        98667 77870