Oct 03,2020 23:26
సిలబస్ లో చేరని పాఠం

కట్టెల పొయ్యిపైన మొక్కజొన్న కంకులు ఉడుకుతున్నాయి. జ్యాం జ్యాం అని మొక్కజొన్నల వాసన పీలుస్తూ అబ్బ అక్కడే కూర్చుని ఉన్నాడు.
'అమ్మా ఆకలే!' అన్నాడు.
'అబ్బా రేరు! రాత్రికి తినేదానికి ఉడకబెడుతున్న మొక్కజొన్నలివి. ఇంకా సాయంకాలమే కాలేదు.. రాత్రయితే కానీ నీకు పెట్టను' అంది అరుంధతమ్మ.
వాడు గబుక్కున కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే అంతా నలుపే కదా! 'అమ్మా అమ్మా! నువ్వు కూడా కళ్ళు మూసుకోవే! రాత్రి అయ్యింది తెలుస్తుంది' అన్నాడు.
అరుంధతమ్మ పడీపడీ నవ్వింది.
'అబ్బా రేరు! భలే తెలివిరా నీది. బాగా ఉడకనివ్వు. ఆటలాడుకుని రా! పెడ్తాలే' అంది. 'మా మంచి అమ్మే' అని అమ్మకు ముద్దు పెట్టి.. ఎగురుకుంటూ.. అర నిక్కరు ఎగేసుకుంటూ ఆడుకోవడానికి ఊర్లోకి వెళ్లాడు.
తెల్లగుడ్డలు కట్టి, నుదుటిన విభూది పెట్టే అరుంధతమ్మకి ఉన్న ఏకైక పుత్రరత్నం కృష్ణమూర్తి అయితే వాడిని ఆమె ముద్దుగా 'అబ్బా రేరు' అని పిలుచుకుంటుంది. ఊర్లో వాళ్ళందరూ 'అబ్బ' అని పిలుస్తారు. రెండు గేదెలను పెంచుకుంటూ పాలు పితికి అమ్ముకుంటుంది. పగటి పూట జామకాయలు, సీతాఫలాలు, మామిడి కాయలులాంటివి బుట్టలో పెట్టుకుని ఊరూరూ తిరిగి అమ్ముతుంది. పదవ తరగతి చదివే అబ్బ అప్పుడప్పుడు అమ్మకి ఉడుత సాయం చేస్తుంటాడు. తిరుపతి పట్టణానికి పట్టుమని పది మైళ్ళ దూరం కూడా లేని చిన్న పల్లెటూరులో వారు ఉంటున్నారు.
అబ్బ పది పాసయ్యాడు. జూనియర్‌ కాలేజీలో చేరాలి కదా, ప్యాంటు షర్టు కుట్టించుకోవాలనుకున్నాడు. తిరుపతిలో అయితే ఎక్కువ ధర పెట్టి కొనాలని, టైలరుకు ఎక్కువ ఇవ్వాలని, బస్సు ఛార్జీలు అవుతాయని ఆలోచించి ఊర్లోనే కుట్టించుకోవాలనుకున్నాడు. అందుకని అమ్మను తీసుకుని గుడ్డ తనే ఇచ్చి, టైలరింగ్‌ చేసే అతాఉల్లా ఖాన్‌ అంగడికి పోయినారు.
''కాలేజీలో చేరబోతున్నావా?'' అని అడిగాడు ఖాన్‌.
ముసిముసి నవ్వులు నవ్వాడు అబ్బ.
''నీవు ప్యాంటును బొడ్డు పైన వెయ్యాలనుకుంటున్నావా? బొడ్డు కింద వెయ్యాలనుకుంటున్నావా? బెల్‌ బాటమ్‌ ప్యాంటు కుట్టమంటావా? మామూలుగా కుట్టమంటావా? గుండీలు పెట్టమంటావా? హుక్కీలు పెట్టమంటావా?'' అని అడిగాడు ఖాన్‌.
అబ్బ అటూఇటూ దిక్కులు చూడసాగాడు.
అంతలో అరుంధతమ్మ ''ఖాన్‌ జీ! పసిపిలగోడు వాడికేమి తెలుసు? అసలు వాడికి ప్యాంటు వేసుకోవడమే రాదు. ఎట్ట బాగుంటే అట్ట కుట్టేరు. గుడ్డ తక్కువ పడితే చాలు'' అంది.
అబ్బ కాసేపు మూతి 'ఉమ్‌' అని పెట్టుకున్నాడు.
''అదికాదు అరుంధతమ్మా! ఈ కాలం కాలేజీ పిలకాయలు రకరకాల ఫ్యాషన్లు కోరుకుంటారు కదా! అందులోనూ కాలేజీలో అమ్మాయిలు కూడా ఉంటారు..'' అన్నాడు.


అమ్మాయిల మాట విన్న అబ్బ బుగ్గలు ఎర్ర బడ్డాయి. ముక్కు పుటాలు చిన్నగా అదిరాయి. పెదవులు వణికాయి.
అమ్మాకొడుకు బయలుదేరుతుంటే ఖాన్‌ చిన్నగా తలగోకుతూ ''అరుంధతమ్మా! అప్పుడు మన అబ్బ ఏడు పాసై, హైస్కూల్‌ చేరతా వున్నప్పుడు కుట్టిచ్చుకున్న గుడ్డల బాకీ కొంచెం ఉంది'' అన్నాడు.
''అదికాదు ఖాన్‌ జీ! మీ బేగంకి చెప్పి అప్పుడప్పుడు పాలు, పెరుగు తీసుకుపోయి ఉంటే లెక్క సరిపోయి ఉండేది కదా! ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? అదీఇదీ కలిపి లెక్క రాసుకో. మీకు పాలు కావాలంటే పాలు, పెరుగు కావాలంటే పెరుగు తీసుకుపొమ్మని చెప్పు. కరెక్టుగా ఆరు నెలలు తీసుకున్నారంటే మీ అప్పు తీరిపోతుంది'' అని చెప్పింది.
''ఇంతకీ మన అబ్బ ఏ గ్రూపులో చేరబోతున్నాడో?!'' అని అడిగాడు.
'బై పి సి' అని టక్కున సమాధానమిచ్చాడు.
''అంటే డాక్టరు అవబోతున్నావన్న మాట!'' అన్నాడు.
వెంటనే అరుంధతమ్మ ''అంతంత పెద్ద చదువులు చదివించడానికి మాకు ఎక్కడ కుదురుతుంది?'' అంటుంటే.. ''లేదు ఖాన్‌ జీ! టీచర్‌ని అవుదామనుకుంటున్నా'' అన్నాడు అబ్బ.
''చాలా మంచిది. ఇంటర్మీడియట్‌ అయ్యిందే టీచర్‌ ట్రైనింగ్‌ చేరు. వెంటనే ఉద్యోగాలు కూడా వస్తాయి. అందులోనూ మన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో టీచర్‌ ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌ 'డైట్‌' ఉంది. మనకి దగ్గర కూడాను. బస్సులో తెల్లారితే పోయి సాయంకాలానికి వచ్చేయ వచ్చు.'' అన్నాడు ఖాన్‌.
''లేదు ఖాన్‌ జీ! టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ అవుతాను. నేను బి యస్సీ, బి ఇడి చేసి హై స్కూలు టీచర్‌ కావాలనుకుంటున్నాను'' అని చెప్పాడు.
''మంచిది అబ్బా! మంచిగా ప్లాను చేస్తున్నావు'' అని చెప్పి పంపాడు.
ఇంటర్‌ చదివాడు. ఎస్వీ యూనివర్సిటీలో బి ఎస్సీ, బిఈడీలు పూర్తిచేశాడు. డి.ఎస్సీ కోచింగ్‌ తీసుకున్నాడు. 2008 డి.ఎస్సీ పరీక్ష పాసయ్యాడు. అతడు ఆశించినట్లు హైస్కూల్‌ టీచర్‌ ఉద్యోగానికి అర్హత రాలేదు. కానీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగానికి అర్హత వచ్చింది. నిదానంగా పరీక్షలు రాసి ప్రమోషన్లు తెచ్చుకుందామనుకున్నాడు. అయితే సెకండరీ టీచర్‌ ఉద్యోగాలను టీచర్‌ ట్రైనింగ్‌ చేసినవారికే ఇవ్వాలని బి ఈడీ చేసిన వారికి ఇవ్వకూడదని కోర్టు ఆదేశం ఇవ్వడంతో అబ్బకు ఉద్యోగం రాలేదు.
''వయసైపోతా ఉంది కొడకా! ఉద్యోగం, సద్యోగం లేకపోతే నీకు పిల్లని ఎవరు ఇస్తారురా? ఏదైనా ప్రైవేట్‌ స్కూల్‌లో అయినా టీచర్‌గా చేరురా కొడుకా'' అని అరుంధతమ్మ సలహా ఇచ్చింది.
అలాగేనని చెప్పి ఒక ప్రైవేటు స్కూలులో సైన్స్‌ టీచర్‌గా చేరాడు అబ్బ.
ఒకరోజు రాత్రి తొమ్మిదయ్యింది. హోరుమని వీస్తోంది గాలి. అబ్బ సైకిల్‌పై సర్రున వచ్చి దిగాడు. అలసిపోయి ఉన్నాడు. గెస పోస్తూ ''అమ్మా ! ఈ ప్రైవేటు స్కూలులో పని చేయలేను'' అన్నాడు.
''అబ్బా రేరు! ఏమయ్యిందిరా?'' అని అడిగింది.
''తెల్లారి ఏడు నుంచి రాత్రి తొమ్మిది దాకా గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. నాలుగు వేల జీతానికి నలభై వేల రూపాయల పని చేయించుకుంటున్నారు. అంతే కాదు, ఆరు నెలల పరీక్షలు అయ్యిందే టీచర్లమైన మేము ఊరూరూ తిరగలాంట. బడిలో పిల్లల్ని చేర్చడానికి ప్రచారానికి వెళ్ళాలంట. ప్రతి టీచర్‌కీ టార్గెట్‌ ఇచ్చారు. టార్గెట్‌ చేస్తే వచ్చే సంవత్సరం ఉద్యోగం ఉంటుందంట. లేకుంటే ఉండదంట'' అని చెప్పాడు.
''కొడుకా! నీకు కష్టమైతే మానేరు. మనకి కూడా మంచిరోజులు రాకపోతాయా?'' అని చెప్పి ఓదార్చింది అరుంధతమ్మ.
ఆ రాత్రి రాగి సంగటి ముద్ద, సెనిక్కాయ పప్పుల ఊరిబిండి, గోరుచిక్కుడు కాయ తాళింపు కడుపారా తిన్నాడు. బాగా అలసిపోయి ఉన్నాడేమో, పడక వేసినాడో లేదో గుర్రు పెట్టి నిద్ర పోయినాడు.
రాత్రి పన్నెండయ్యింది.
''అమ్మా కడుపునొప్పే'' అంటూ అమ్మను లేపినాడు.
''వేడి ఏమైనా అయ్యిందేమోరా కొడకా!'' అంటూ ఆమె వేడినీళ్లు తాగిపించింది. ఆముదం నూనె పొట్టపైన రాసింది.
తట్టుకోలేని నొప్పితో అబ్బ పొర్లిపొర్లి ఏడ్చినాడు.
వాడు ఏడ్చేది చూసి అరుంధతమ్మ కూడా ఏడ్చింది.
కొంచెం తెరప ఇచ్చినట్లు అయితే, లేచి కూర్చున్నాడు.
కడుపులో నుంచి ఎగదన్నుకుని వచ్చింది భొలక్‌మని వాంతి.
ఆ రాత్రంతా అబ్బ నొప్పికి అల్లాడిపోయాడు.


తెల్లారయ్యింది.
ఇద్దరూ నిద్ర లేచి, స్నానాలు చేసి తిరుపతి బస్సు ఎక్కారు. స్విమ్స్‌ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. రక్త పరీక్షలు, ఎక్స్‌ రే, స్కానింగ్‌లు చేశారు. పాంక్రియాస్‌ పైభాగంలో క్యాన్సర్‌ ఉందని గుర్తించారు. ఆంకాలజీ విభాగానికి పంపించారు.
అరుంధతమ్మకు దు:ఖం ఆగలేదు. ''ఏమీ కాదులేమ్మా'' అని అబ్బ ఓదార్చాడు.
మొదటిగా సర్జరీ చేద్దామన్నారు. నాలుగు నెలల తర్వాత రేడియో థెరపీ, కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ ఇద్దామన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని, అంతా మంచే జరుగుతుందని దైర్యం చెప్పారు.
ఆరు నెలలు గడిచింది. మనిషి సగం బరువు తగ్గాడు. శరీరమంతా నల్లగా మారసాగింది. వెంట్రుకలు రాలిపోయాయి. మనిషి గుర్తు పట్ట లేనంతగా అయ్యాడు. కళ్ళల్లో రక్తం ఉందో లేదో అని అరుంధతమ్మ రోజూ కనురెప్పలు తెరిచి చూసేది. ఖర్జురాలు తింటే రక్తం పడుతుందని ఎవరో చెబితే పూటపూటా ఖర్జూరం తినిపించేది. 'చెట్టంత కొడుకు లేచి తిరగబోతాడా' అని ఎదురుచూసేది. రోజూ కోడిగుడ్డు ఉడకబెట్టి ఇచ్చేది. గ్లాసు నిండా పాలు తాగిపించేది.
అప్పుడప్పుడు బంధువులు వచ్చి, ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళేవాళ్ళు. డి.ఎస్సీ రాసి ఉద్యోగం రాని అయిదారుమంది మిత్రులు మాత్రం వచ్చి చాలాసేపు కూర్చొని వెళ్ళేవాళ్ళు. 'పోగొట్టుకున్న టీచర్‌ ఉద్యోగం ఎలా సంపాదించాలా?' అని వారిలో వారు గంటలకొద్దీ మాట్లాడుకునే వారు.
ఒక ఆదివారం ఉదయం- అరుంధతమ్మ లేచి, తల స్నానం చేసి ఇల్లంతా ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులేసింది. చిన్న బిందె తీసుకెళ్లి బర్రెల పాలు పితికింది.
పాలు కాచి, కొడుకు దగ్గరికి వెళ్ళింది ''అబ్బా రేరు, లేచి పాలు తాగరా, కొంచెం శక్తి వస్తుంది'' అని చెప్పి భుజం తట్టింది. చల్లగా తగిలింది శరీరం. అనుమానంగా చూసింది. ఒళ్ళు ఊగించింది. కదలలేదు, మెదలలేదు.
''కొడకా నన్ను విడిచి పోయావా? ముప్పై ఏండ్లకే నూరేళ్లు నిండాయా?'' అంటూ గట్టిగా తల కొట్టుకుంటూ ఏడ్చింది.
చనిపోయి నాలుగేళ్లయ్యింది.
ప్రతీరోజూ స్నానం చేసిందే, అరుంధతమ్మ అబ్బ ఫోటోను శుభ్రంగా గుడ్డ పెట్టి తుడుస్తుంది. కొడుకు నుదిటిన కుంకుమ పెడుతుంది. ఇంటి పెరట్లో పూచిన నందివర్ధనమో, గన్నేరుపువ్వో ఏదో ఒక పువ్వు పెడుతుంది. మట్టి దీపంలో నూనెపోసి వొత్తి వెలిగిస్తుంది. ''అబ్బా రేరు అబ్బా'' అంటూ ఏడుస్తూ కాసేపు కూర్చొంటుంది.
అబ్బ వాడిన పెన్సిలు,పేనా,రబ్బరు, భద్రంగా ప్లాస్టిక్‌ కవర్లో పెట్టుకుని, అప్పుడప్పుడు వాటిని చూసుకుని ఏడుస్తుంది.


ఒక ఆదివారం ఉదయం-
వర్షం జోరుగా కురుస్తోంది.
ఇంటి ముందరి జామ చెట్టు గాలికి అటూఇటూ ఊగుతోంది. అతా ఉల్లాఖాన్‌ గొడుగు వేసుకుని న్యూస్‌ పేపర్‌ చంకన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. గేదెలు 'అంబా అంబా' అని అరుస్తున్నాయి.
అబ్బ ఫోటో ముందర కూర్చుని ఉన్న అరుంధతమ్మ చిన్నగా నడుచుకుంటూ ఇంటి బయటికి వచ్చింది.
''నా కొడుకు ప్రైవేటు స్కూలులో పనిచేస్తున్నప్పుడు కుట్టించుకున్న ప్యాంటు పైసలు ఇవ్వలేదని వచ్చావా? వసతి లేక ఇవ్వలేదు. ప్రాణం పొయ్యేలోగా నీ అప్పు తీర్చేస్తాను ఖాన్‌ జీ!'' అని బాధగా చెప్పింది.
''అయ్యో! అరుంధతమ్మా, ఆ డబ్బులకు రాలేదు నేను. పేపర్లో వచ్చిన విషయం ఒకటి చెప్పి పోదాము అని వచ్చినాను'' అన్నాడు.
''ఏమి విషయం ఖాన్‌ జీ?''
''చాన్నాళ్ల క్రితం మన అబ్బ టీచర్‌ ఉద్యోగానికి పరీక్ష రాసి, పాసైనాడు కదా! సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు బీ.ఇడి వారు అర్హులు కాదని, టీచర్‌ ట్రైనింగ్‌ చదివిన వారే అర్హులని అప్పుడు ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్షలో అర్హత సంపాదించి, అదనపు విద్యార్హతల వల్ల చాలామంది వచ్చిన ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అబ్బలాంటి వారు కోర్టును ఆశ్రయించారు. వారందరికీ టీచర్‌ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఎంపికైన జాబితాలో మన అబ్బ పేరు కూడా ఉంది. దురదృష్టవశాత్తు మన అబ్బ ఇప్పుడు లేడు'' అని ఏడుస్తూ చెప్పాడు.


ఎక్కడో ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దం.
వింటున్న అరుంధతమ్మ 'ఓ' అని ఏడుస్తూ ''అబ్బా రేరు..... నీకు ఉద్యోగం వచ్చిందంటరా కొడుకా ...!'' అని అరుస్తూ ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి, కొడుకు ఫోటో ముందర ధభీ మని పడిపోయింది.
ఫోటో ముందరి నూనె దీపం గాలికి కాసేపు అటూఇటూ ఊగి ఆరిపోయింది. చిన్నగా దీపం పొగలు గాలిలో తేలుతూ ఖాన్‌ ముఖాన్ని తాకాయి. గది లోపలి నుండి అరుంధతమ్మ నోటి వెంట ''ఎక్కడున్నావు కొడుకా?'' అనే మాట మెల్లిగా వినిపిస్తూ ఉంది.

- ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
9393662821