Oct 27,2021 11:34

లండన్‌ : ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు వచ్చే సీజనల్‌ ఇన్‌ఫెక్షన్‌గా కోవిడ్‌-19 మారి ఉండవచ్చునని, అందుకు గట్టి ఆధారాలున్నాయని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది చాలావరకూ సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజాలా రూపాంతరం చెంది ఉండొచ్చని తెలిపారు. ఇది గాలి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోందన్న వాదనను సమర్థిస్తోంది. పరిసరాల్లోని గాలిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

శాస్త్రవేత్తల అధ్యయనం..
శాస్త్రవేత్తలు మొదట నిర్వహించిన సైద్ధాంతిక నమూనా అధ్యయనంలో.. కోవిడ్‌ వ్యాప్తిలో వాతావరణం ఒక కారకం కాదని నిర్థారణ అయ్యింది. ఈ కోవిడ్‌ మహమ్మారి చైనాలో తొలుత ఉత్పన్నమైన ప్రాంతాన్ని పరిశోధకులు పరిశీలించారు. అది 30, 50 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నట్లు గుర్తించారు. అక్కడ గాల్లో తేమ చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఉష్ణోగ్రత కూడా 5 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉన్నట్లు గుర్తించారు.

ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువ ...
ఈ నేపథ్యంలో162 దేశాల్లో కోవిడ్‌ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు, తేమ చూపిన ప్రభావాన్ని పరిశీలించారు. ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఈ రెండు పరిమితులు పెరిగినప్పుడు కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వేసవిలో మాత్రం ఈ పోకడ విచ్ఛిన్నమైందని, ఆ కాలంలో యువత ఎక్కువగా గుమికూడటం, పర్యాటకులు పెరగడం, ఏసీ ల వాడకం వంటివి ఇందుకు దోహదపడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.