Jun 13,2021 06:59

ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. షరా మామూలుగా ఈ పర్యటనకు ముందు నుంచి రకరకాల కథలు ప్రచారంలోకి రావడమేగాక ఆయన వారిని కలుసుకుంటున్న తరుణంలో కూడా కొనసాగాయి. ఇది రాష్ట్రంలో రాజకీయ వాతావరణానికి ప్రతిబింబం. జగన్‌ ఢిల్లీ యాత్ర అనగానే తనపై వున్న సిబిఐ కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన కేంద్ర నేతలను కలుస్తున్నారంటూ కథనాలు మొదలవుతాయి. ఆ కేసులున్నంత కాలం ఈ మాట వుంటూనే వుంటుంది. ముఖ్యమంత్రి కలుసుకోవడమూ తప్పనిసరిగా జరుగుతూనే వుంటుంది. కలసినప్పుడు ఏమేం మాట్లాడుకుంటారనేది ఎలాగూ పూర్తిగా బయిటకు రాదు. సిబిఐ తో సహా కేంద్ర సంస్థలు బిజెపి యేతర రాష్ట్రాలతో ఎలా దాగుడుమూతలు ఆడుతున్నాయో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రాజకీయ కుటిల వ్యూహాలకు పేరుమోసిన హోంమంత్రి అమిత్‌షా వంటి వ్యక్తి వాటిని సూటిగా చర్చించి అభయం ఇచ్చి పంపుతారనుకోవడం హాస్యాస్పదం. అలా భావించినా అత్యాశే. కాగా అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ రద్దయిందని ఆఖరి నిముషంలోనూ కథనాలు ప్రసారం చేయడం వల్ల మీడియా విశ్వసనీయతకు విఘాతం తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమిటో తెలియదు. వ్యక్తి ఎవరైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్కువ చేసి కేంద్ర నేతలు మాత్రం అతీతులైనట్టు చిత్రించడం కూడా గౌరవ ప్రదమైన విషయం కాదు. వైసిపి, టిడిపి నిరంతర ఘర్షణలో జరుగుతున్నదే అది.
రాని నిధులు, తేలని సమస్యలు
కథనాలు పక్కనపెట్టి ఈ పర్యటన తీరు, ఫలితాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రంలో కీలక నేత హోం మంత్రి అమిత్‌షా తో సహా అయిదుగురిని కలుసుకున్నారు. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్‌, పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియా లోనూ రాజకీయ వర్గాలలోనూ ముఖ్యమంత్రి జగన్‌ హోంమంత్రి అమిత్‌షా కు ఇచ్చిన వినతిపత్రంలో వివిధ అంశాలు సమగ్రంగా పొందుపర్చడం ఒకటైతే మిగిలినవారికి శాఖల వారీ అంశాలు వచ్చినట్టు కనిపిస్తుంది. పోలవరం పెరిగిన ఖర్చును రూ. 55 వేల కోట్లకు ఆమోదం తెలిపి ఎప్పటికప్పుడు బకాయిలు విడుదల చేయడం, విద్యుత్‌ రంగంలో నలభై ఏళ్ల పాటు కొనుగోలు చేయాలనే ఒప్పందం రద్దు ద్వారా రూ. 300 కోట్ల పైన అనవసర భారం తగ్గింపు, ఉపాధి పనుల బకాయిలు రూ. 4 వేల కోట్లు, పౌర సరఫరాల శాఖకు రావలసిన రూ. మూడు వేల కోట్ల పైగా మొత్తాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆయా మంత్రుల దృష్టికి తెచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం రేషన్‌ బియ్యం కేటాయించడం రాష్ట్రానికి చాలా నష్టదాయకమని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరారు. పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు కూడా చర్చించారు. రాష్ట్రంలో మహానగరాలు లేవు గనక సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకారం అనివార్యమని, ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేక హోదా మాత్రమే మార్గమని కూడా ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా మూడు రాజధానులు పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి వున్నదని అమిత్‌షా కు చెప్పడమే గాక ఆ మేరకు హైకోర్టును కర్నూలుకు తరలించడానికి రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ తో సమావేశంలో తాము కట్టబోయే కాలనీలలో మౌలిక సదుపాయాల బాధ్యత కూడా పి.ఎం.ఎ.వై లో చేర్చాలని కోరారు. ఈ భేటీల తర్వాత గజేంద్ర షెకావత్‌ సమావేశం ఫలప్రదమైనట్టు ట్వీట్‌ చేశారు గాని స్పష్టంగా ఏం చెప్పింది లేదు.
సి.ఎం నివేదనే గానీ కేంద్రం స్పందన?
కనుక మౌలికంగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనలను కేంద్రం అంగీకరించిందా ఆ దిశలో చర్యలు తీసుకోబోతోందా అన్నది మాత్రం అటూ ఇటూ ఎవరూ చెప్పడం లేదు. 2014లో విభజిత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వన్‌ వే ట్రాఫిక్‌లా ఇలా కేంద్రానికి మొర పెట్టుకోవడం జరుగుతూనే వుంది గాని కరుణించడమే జరగడం లేదు. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా వున్నా కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకోవడం కోసం ఢిల్లీ వెళ్లడం, వివిధ శాఖల మంత్రులతో మాట్లాడటం షరామామూలే. గతంలో తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అంటుండేవారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన పిల్లిమొగ్గలు అందరూ చూశారు. అప్పుడు హోదాపై చాలా గట్టిగా దీక్షలు చేసిన జగన్‌ తనకు అధికారం రాగానే మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వుంది గనక తాము ఒత్తిడి చేసి తెచ్చుకోగలిగింది వుండదని ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పేశారు. ఇతర అంశాలలో కూడా కేంద్రం నుంచి నిధుల విడుదల గాని, విభజన సమస్యల పరిష్కారం గాని జరిగింది ఒరిగింది నామమాత్రమే. జగన్‌ ప్రస్తుత పర్యటన కూడా ఇందుకు భిన్నమైన ఫలితాలు సాధించింది లేదు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అభ్యర్థించడం న్యాయమేగాని అది నిరాకరించబడుతున్నప్పుడు రాజ్యాంగ బద్దంగా జరగాల్సినవి కూడా జరగనప్పుడు నిరసించవలసిన, నిలదీయవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ప్రజలనూ ప్రతిపక్షాలనూ సమీకరించి రాష్ట్రం తరపున ఒత్తిడి పెంచవలసి వుంటుంది. గత ప్రభుత్వం ఆ పని చేయనందువల్ల చాలా నష్టం జరిగింది. ఊరి ముందుకొచ్చాక ఉరుకులు పెట్టినట్టు ఎన్నికలు దగ్గరకొచ్చాక చంద్రబాబు కేంద్రంతో విడగొట్టుకుని ధర్మ పోరాటాలు చేసినా రాష్ట్రం కర్మఫలం మారింది లేదు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ పరిస్థితి మారింది లేదు. కేంద్రానికి లోబడి వుండటానికి, మంచిగా వున్నామనే సంకేతం ఇవ్వడానికే పాకులాడటం జరుగుతున్నది. రాష్ట్రంలో విద్య నుంచి విద్యుత్‌ వరకూ కేంద్రం ఏకపక్ష ఆదేశాలను, పథకాలను అందరికన్నా ముందే అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారు. అంతేగాక కేంద్రంపై ప్రధానిపై ఇతరులు విమర్శలు చేసినా సరికాదని చెప్పి విమర్శలు కొనితెచ్చుకున్నారు. ప్రభుత్వ వైఖరికి అలా వుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై పోరాడుతున్నారా అదీ లేదు. టిడిపి విమర్శలు జగన్‌ ప్రభుత్వానికే పరిమితమవుతున్నాయి. ఈ మధ్య వారి వర్చువల్‌ మహానాడులో కేంద్రానికి అంశాలవారి మద్దతునిస్తామని కూడా తీర్మానం చేశారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితికి భిన్నమైన వాతావరణం ఏపి లోనూ (కొంతవరకూ తెలంగాణ లోనూ) చూస్తున్నాం.
రాజధానిపై ద్వంద్వనీతి
రాష్ట్రమంతా ఒక్కటై వ్యతిరేకించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశంలో కూడా హామీ ఇవ్వడానికి నిరాకరించడం కేంద్ర దురహంకారానికి పరాకాష్ట. ఈ సమయంలో ముఖ్యమంత్రి విశాఖ ఉక్కుకు స్వంత గనులు కేటాయించడం వంటి కోర్కెలు ముందుంచినా రుణాలను ఈక్విటీగా మార్చడం అనే తన పాత ఫార్ములాను మరోసారి ప్రస్తావించడం గమనించదగింది. పాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల విధానాన్ని మరోసారి చెప్పి వచ్చారు. దీనిపై ఢిల్లీ పెద్దలు ఏ రూపంలోనూ ఎలాంటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు. రాష్ట్రంలో బిజెపి నేతలేమో అమరావతి దీక్షలకు మద్దతు చెబుతుంటారు. ఆ కమిటీకి కూడా సంఘపరివార్‌ వ్యక్తినే గౌరవాధ్యక్షుడుగా పెట్టుకున్నారు. ఎ.పి సమస్యల విషయంలోనూ రాజధాని రాజకీయంలోనూ బిజెపి ద్వంద్వ నీతికిది దర్పణం పడుతుంది. హైదరాబాదులో పదేళ్లు ఉమ్మడి రాజధానికి అవకాశం వున్నా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా వచ్చేసి ఆ హక్కు వదులుకున్నారు తప్ప కొత్త రాజధానికి ఒక రూపం తేలేదు. జగన్‌ అధికారం చేపట్టాక అక్కడ సచివాలయ భవనాలు కూడా అప్పగించారు గాని అమరావతిలో అసంపూర్ణ నిర్మాణాలు పూర్తి చేయలేదు. తమ వికేంద్రీకరణ చట్టంతో తలెత్తిన న్యాయ ప్రతిష్టంభన తొలగకుండానే విశాఖకు పాలనా రాజధాని తరలించేస్తామని హడావుడి చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేవని పదేపదే అంటున్న జగన్‌ తన విధానంతో మూడు నగరాలలోనూ అనిశ్చితి తాండవించడం సమాజ ఆర్థిక కార్యకలాపాలు, ప్రజల జీవితాలు కూడా దెబ్బ తినడం గుర్తించాల్సి వుంది. కరోనా తాకిడిలో ఎ.పి కి ఇది ప్రత్యేకమైన సంకటంగా మారింది.
రాష్ట్రం కోసం పోరాటం, తగాదాలు తర్వాత .
తమాషా ఏమంటే బిజెపి ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన, అన్ని రాజకీయ పక్షాలూ ఆమోదించిన విషయం కర్నూలుకు హైకోర్టు తరలింపు. అందుకోసం రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని జగన్‌ కోరినదానిపైనా కేంద్రం స్పందన లేదు. మామూలు ప్రకారం హైకోర్టుతో సంప్రదించి సుప్రీం కోర్టు ద్వారా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ఈ మధ్యనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైకోర్టుల స్థితిగతులపై జరిపిన వర్చ్యువల్‌ సమావేశంలో ఎ.పి హైకోర్టు సి.జె అరూప్‌ గోస్వామి అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని ఫిర్యాదు చేశారు. కనీస వసతులు లేకుండా న్యాయ ప్రక్రియ సజావుగా జరగడం కష్టమని సిజెఐ వ్యాఖ్యానించారు. కాని త్రిశంకు స్వర్గంలా వున ఎ.పి హైకోర్టుకు ఇక్కడ వసతులు పెంచడం గాని, కర్నూలుకు తరలించే చర్యలు గాని ఏవీ జరగకపోవడం వాస్తవం. మూడు రాజధానుల వంటి అంశాలు మినహాయించితే జగన్‌ పర్యటనలో ప్రస్తావించిన సమస్యలు చాలా వరకూ వాస్తవికమైనవే. రెవెన్యూ లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాల ప్యాకేజీ, పోలవరం నిధుల మంజూరు విభజన సమస్యల పరిష్కారం వంటివన్నీ విభజన చట్టంలో వున్నా కేంద్రం రకరకాల సాకులతో నిరాకరిస్తున్నది. కోత కోస్తున్నది. పార్లమెంటు సాక్షిగా ఏకాభిప్రాయంతో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఏకపక్షంగా ప్రకటించింది. కేంద్రం నిర్లక్ష్యాన్ని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా ప్రదక్షిణలు చేయడంతో కలిగే ప్రయోజనం సున్నా. తనకు రాజకీయ ప్రయోజనం లేకుండా కేంద్ర బిజెపి నాయకత్వం ఎలాగూ సహకరించబోదని ఇప్పటికి చాలాసార్లు స్పష్టమైన విషయాన్ని ముఖ్యమంత్రి తాజా పర్యటన మరోసారి నిరూపించింది. అందుకే కేంద్రం విభజిత ఆంధ్ర ప్రదేశ్‌ను ఆదుకునేలా ప్రజలను సమీకరించి ఒత్తిడి పెట్టేందుకు, రాజ్యాంగ బద్దమైన హామీలు సాదించుకునేందుకు పాలక ప్రతిపక్షాలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడాలి. వారి వారి తగాదాలు ఆ తర్వాత చూసుకోవచ్చు. మరో మూడేళ్లు ఎలాగూ ఎన్నికలుండవు గనక ఈ కాలమంతా వాటిలో మునిగితేలడం అవివేకం, రాష్ట్రానికి నష్టదాయకం.

                                       సి.ఎం నివేదనే! కేంద్రం స్పందన?              - తెలకపల్లి రవి