Dec 03,2021 21:36

- కొనసాగుతున్న టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల నిరసన
- సొమ్మసిల్లిన మహిళలకు శిబిరం వద్దే సెలైన్‌

ప్రజాశక్తి-తిరుపతి సిటీ :రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీను కూడా టిటిడి అధికారులు, కాంట్రాక్టర్లు ఖాతరు చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులు తిరిగి దీక్షలను కొనసాగించేందుకే నిర్ణయించి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురు, శుక్రవారాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పరిసరాల్లోని ముంపు ప్రాంతాల పర్యటనలో ఉండడంతో కార్మికులు ఎక్కడ అడ్డుకుంటారోనని పోలీసులు పెద్ద ఎత్తున టిటిడి ఎడి బిల్డింగ్‌ వద్ద మోహరించారు. పోలీసుల వలయాన్ని దాటుకుని కొంత మంది మహిళా కార్మికులు సిఎంను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తమను ఆదుకోవాలని బోరున విలపించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి 'మీ సమస్యను పరిష్కరించమని ఎప్పడో చెప్పాను, ఇంకా చేయలేదా? మీరేమి కంగారు పడవద్దు పరిష్కరించే బాధ్యత నాది' అని హామీ ఇచ్చారు. అప్పటికి మహిళలు ఒప్పుకోకపోవడంతో మహిళా కార్మికులు తలపై చెయ్యి పెట్టి, నా తొబుట్టువులాంటి మీపై ఒట్టేసి చెబుతున్నా తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కారిస్తానని చెప్పడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. టిటిడి అధికారులు సిఎం హామీని అమలు చేస్తామని హామీ ఇవ్వకపోవడంతో కార్మికులు టిటిడి పరిపాలన భవనం ప్రధాన ద్వారం వద్ద పుట్‌పాత్‌పై బైఠాయించి నిరసన కొనసాగించారు. ఇద్దరు మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోవడంతో శిబిరం వద్దే సెలైన్‌ బాటిల్‌ పెట్టారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల ఆందోళనకు పలు ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి.