Nov 25,2021 21:44

ప్రజాశక్తి - కడపప్రతినిధి
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని సిబిఐ కస్టడీకి తీసుకుంది. శంకర్‌రెడ్డిని ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో ఇటీవల సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌పై గురువారం వాదనలు విన్న న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. డిసెంబర్‌ రెండవ తేదీ వరకు శంకర్‌రెడ్డి సిబిఐ కస్టడీలో ఉంటారు. ప్రస్తుతం శంకర్‌రెడ్డి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని సిబిఐ మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వివేకా మాజీ డ్రైవర్‌ సహా మరో ఇద్దరిని విచారించిన నేపథ్యంలో ఒకరు అప్రూవర్‌గా మారి హత్యోదంతం వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. శంకర్‌రెడ్డి విచారణ అనంతరం ఎవరి పేర్లు బయటికొస్తాయోననే చర్చ జరుగుతోంది.