
సిడ్నీ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్లు పరుగుల వరద పారించారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (114 : 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (105 : 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగిపోయారు. దుబారు వేదికగా జరిగిన ఐపిఎల్ 13వ సీజన్లో దారుణంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (45 : 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (69 : 76 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరలో అలెక్స్ క్యారీ 17 (13) పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. దీంతో కోహ్లీ సేనకు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బూమ్రా, నవదీప్ షైనీ, యుజ్వేంద్ర చాహల్ తలా వికెట్ తీశారు.

ఫించ్‌కు లైఫ్.. ఆ తరువాత దూకుడు..
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆదిలో వార్నర్, ఫించ్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ఇద్దరూ బ్యాట్‌కు పనిచెప్పారు. 38 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని ఫించ్ తప్పించుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విసిరిన వైడ్ డెలివరీని వెంటాడిన ఫించ్.. బంతిని గాల్లోకి లేపాడు. శిఖర్ ధావన్ క్యాచ్ అందుకునేందుకు ముందుకు దూకినప్పటికీ బంతి అతడికి అందలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫించ్.. కాసేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోకొద్ది సేపటికి వార్నర్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. అయితే మహ్మద్ షమీ 28వ ఓవర్లో వార్నర్‌ను ఔట్ చేసి టీంఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనింగ్ జోడి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు.

భారత బౌలర్లపై ఫించ్, స్మిత్ ఎదురుదాడి..
వికెట్ తీసిన ఆనందం భారత శిబిరంలో ఎంతోసేపు లేదు. ఒకవైపు ఫించ్, మరోవైపు స్మిత్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా స్మిత్ వేగంగా ఆడాడు. ఇక 117 బంతుల్లో సెంచరీ చేసిన ఫించ్.. తొలి అర్ధసెంచరీ కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. సెంచరీ చేసిన వెంటనే 114 పరుగుల వద్ద ఫించ్ ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ వీరవిహారం చేశాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా ఆడుతున్న స్మిత్ 66 బంతుల్లోనే 105 పరుగులతో సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. మొత్తం ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.
