Dec 03,2021 21:16

ఫైనల్లో అర్జెంటీనా × జర్మనీ
ఎఫ్‌ఐహెచ్‌ హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌

భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లోకి జర్మనీ, అర్జెంటీనా జట్లు ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన సెమీస్‌ పోటీలో భారతజట్టు 1-4 గోల్స్‌ తేడాతో జర్మనీ చేతిలో చిత్తుగా ఓడింది. క్వార్టర్స్‌లో బెల్జియంపై అద్భుత విజయం సాధించి సెమీస్‌కు చేరిన హాకీ కుర్రాళ్లు నేటి మ్యాచ్‌లో ఆ ప్రతిభను కనబర్చలేకపోయారు. మరో సెమీస్‌ పోటీలో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌ను చిత్తుచేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా జట్టు 3-1 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీ జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.