Apr 08,2021 16:17

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిబిఎస్‌ఇ 10, 12 తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన సిబిఎస్‌ఇ బోర్డు.. షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది. కాగా, మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షల్ని రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ పిటిషిన్‌పై లక్ష మందికిపైగా విద్యార్థులు సంతకాలు చేశారు. ఇది గత రెండు రోజులుగా cancelboardexams2021 హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. అలాగే మరో పిటిషన్‌లో 'దేశంలో తక్కువ కేసులు ఉన్నప్పుడే గతేడాది వార్షిక పరీక్షల్ని రద్దు చేశారు. మరి ఇప్పుడు కేసులు భారీగా పెరుగుతుంటే.. పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించి గతేడాదిలాగే.. ఈ ఏడాది కూడా పరీక్షల్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖా మంత్రిని కోరుతున్నాం. ఇప్పటికే విద్యార్థులమంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం' అని ఓ పిటిషనర్‌ పేర్కొన్నారు.

అయితే, ఈ పిటిషన్లపై స్పందించిన సిబిఎస్‌ఇ అధికారి ఒకరు.. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్ని కూడా 40 నుంచి 50 శాతం వరకు పెంచామని, నిబంధనలు పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని గత వారం సిబిఎస్‌ఇ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియరీ పరీక్షలకు కూడా అదే మినహాయింపు కల్పిస్తారా? లేదా? అన్నది సదరు అధికారి వెల్లడించలేదు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం వార్షిక పరీక్షలు యధావిధిగా జరుగుతాయని సిబిఎస్‌ఇ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సెక్రటరీ గెర్రీ అరాథూన్‌ తెలిపారు.