Apr 12,2021 19:29

కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఇంట్లోకి వచ్చాడు గోపి. నాల్గవ తరగతి
చదువుతున్నాడు. ''ఏంట్రా! ఎందుకేడుస్తున్నావు?'' కంగారుపడుతూ అడిగింది తల్లి.
''చింటూగాడు నన్ను బంతితో కొట్టాడు!'' తల్లికి ఫిర్యాదు చేశాడు గోపి.
''దెబ్బలేమైనా తగిలాయా?'' తల్లి అడిగింది.
''లేదు! ''వాడు నన్ను కొట్టాడు! అందుకే నేను ఏడుస్తున్నాను!!'' గోపి సమాధానం ఇచ్చాడు.
''చిన్నచిన్న విషయాలకు ఇలా ఏడవకూడదు!'' నచ్చజెప్పే ప్రయత్నం చేసింది తల్లి.
''అమ్మా! ఈ రోజు తెలుగు నూతన సంవత్సరం కదా! కేక్‌ చేశావా? అడిగింది గోపి అక్క గౌతమి.
ఈ రోజు ఉగాది పచ్చడి తయారుచేసుకుని తినాలి! చెప్పింది తల్లి.
ఉగాది పచ్చడి అంటే? అమాయకంగా అడిగింది గౌతమి.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం!
షడ్రుచులు అంటే ఏంటమ్మా? అడిగాడు గోపి.
ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. తీపి,పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. వీటిని షడ్రుచులు అంటారు.
ఉగాది పచ్చడి ఎలా తయారుచేస్తారు? అడిగింది గౌతమి.
తీపి చెరుకుగడలు, పుల్లని చింతపండు, చేదు వేపపూత, వగరు మామిడి ముక్కలు, కాస్త ఉప్పు, కాస్త కారం వేసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అంటూ ఉగాది పచ్చడి తీసుకొచ్చి పిల్లలిద్దరికి పెట్టింది తల్లి.
అసలు ఈ పచ్చడి వల్ల లాభమేంటి? అని అడిగారు? ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, కష్టం, లాభం, నష్టం, ఉత్సాహం, ఉద్వేగం ఉంటాయి. అన్నిటినీ సమానంగా స్వీకరించాలి. అప్పుడే గొప్ప వాళ్లు అవుతారు' అని చెప్పి లోపలికి వెళ్లింది.
వీధిలో నుండి గోపి స్నేహితులు కేకేశారు. ''వస్తున్నా!'' అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న గోపి మంచం తగిలి కిందపడ్డాడు. మోకాలికి గాయం అయ్యింది. ఆ నొప్పికి కాసేపు అలాగే ఉండిపోయాడు. వెంటనే ''మరేం పర్లేదు! చిన్న గాయమే!' అంటూ బయటకు పరుగు తీశాడు. బాధను భరించడమే కాక స్నేహితుడు కొట్టాడని ఏడుస్తూ కూర్చున్న వాడల్లా వాళ్లతో కలిసేందుకు వెళ్లడం చూసిన అమ్మ ఎంతో సంతోషించింది.
- పేట యుగంధర్‌, 9492571731