Oct 27,2021 18:58

ప్రజాశక్తి - గోపాలపురం
        గ్రామ సచివాలయాల ద్వారా అన్ని రకాల సేవలను ప్రజలకు అందించేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్‌ సూచించారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మండల అధికారులతోనూ, అన్నిగ్రామాల కార్యదర్శులకు, స్థానిక 1,2,3, సచివాలయ సిబ్బందికి ఎంపిడిఒ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహరనాథ్‌ మాట్లాడుతూ కొవ్వూరు డివిజన్‌లోని 13 మండలాలకు సచివాలయ సేవలందించడంలో మొదటిస్థానంలో అత్తిలి, రెండో స్థానంలో గోపాలపురం, మూడోస్థానంలో దేవరపల్లి ఉన్నాయన్నారు. సచివాలయాల సిబ్బంది సచివాలయం ద్వారా అందించే సేవలను ప్రజలకు పూర్తిగా అందించేలా పని చేయాలని, సచివాలయం పనితీరు ఎప్పటికప్పుడు మండలస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు అమలు జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఎంతో ముఖ్యమన్నారు. సచివాలయాల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాభివృద్ధికి అన్ని రకాల సేవలు సచివాలయం ద్వారా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించిందని, ప్రతిఒక్కరూ బాధ్యతతో అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా నూతన సచివాలయాల నిర్మాణ పనులపై అధికారులను వివరాలను తెలుసుకుని వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌, ఎంపిడిఒ ఆర్‌.శ్రీదేవి, తహశీల్దార్‌ జి.రత్నమణి, కొవ్వూరు డిఎల్‌పిఒ బమ్మిడి సాంబమూర్తి, పంచాయతీరాజ్‌ ఎఇ, సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.