Jan 14,2022 20:35

న్యూయార్క్‌ : సౌర వ్యవస్థకు వెలుపల అతి పెద్ద చంద్రుడు (సూపర్‌ మూన్‌) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ఈ నిర్ధారణలు తాత్కాలికమే. ఈ ఖగోళ వస్తువును నేరుగా పరిశీలించడానికి వీల్లేనంత దూరంలో వుంది. ఆ వస్తువు నుండి వస్తున్న సంకేతాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు సైన్స్‌ జర్నల్‌ నేచర్‌ ఆస్ట్రానమీలో ప్రచురితమయ్యాయి. భూమికి 5,500 కాంతిసంవత్సరాల దూరంలో వున్న నక్షత్రం చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న చందమామకు కెప్లర్‌1708 బి-ఐగా పేరు పెట్టారు. కెప్లర్‌ టెలిస్కోప్‌ ద్వారా అందిన సాక్ష్యాధారాలను బట్టి చూసినట్లైతే కొత్తగా కనుగొన్న చందమామ, పరిమాణంలో భూమికన్నా 2.6రెట్లు పెద్దది,. దాన్నిండా పూర్తిగా వాయువులు నిండి ఉన్నట్లు భావిస్తున్నారు. సౌర వ్యవస్థకు వెలుపల దాదాపు ఐదు వేల గ్రహాలు ఉన్నట్లు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వీటిని బాహ్య గ్రహాలుగా పేర్కొంటారు. కెప్లర్‌1708 బి-ఐతో పాటు రెండు బాహ్య చందమామలను మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. మొదటిదాన్ని 2017లో కనుగొన్నారు. సహేతుకమైన సందేహాన్ని మించి ఇప్పటివరకు దీన్ని రుజువు చేయలేకపోయారు. మన సౌర వ్యవస్థకు, ఆ చందమామలకు మధ్య చాలా దూరం వున్నందువల్ల ఎక్కువ సమయం వాటిని నేరుగా చూడడం సాధ్యం కాదు. బాహ్య గ్రహాలు వెదజల్లే కాంతిపుంజాల్లో హెచ్చుతగ్గుల రూపంలో (ట్రాన్సిట్‌ లైట్‌ కర్వ్స్‌గా పేరొందిన), అక్కడ వున్న పరిస్థితుల ఆధారాలపైనే ఖగోళ శాస్త్రవేత్తలు ఆధారపడాల్సివస్తోంది. మన సౌర కుటుంబంలో వుండే, చందమామల కన్నా ఈ బాహ్య చందమామలు చాలా భిన్నంగా వుంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ చందమామలు రూపొందిన క్రమాలు, అవి కక్ష్యల్లో తిరిగే ధోరణులు తేడాగా వుంటాయని అంచనా..