Feb 23,2021 19:07

మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయి. విపరీతంగా మంచు కురుస్తుంది. ఎన్ని స్వెటర్లు, దుప్పట్లు కప్పుకున్నా శరీరంలో ఒణుకు ఉంటుంది. అక్కడ నిరంతరం గస్తీ కాసే ఆర్మీ జవాన్ల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎత్తయిన ప్రదేశాల్లో ఉండాల్సినప్పుడు అక్కడ మంచుకి శరీరం గట్టకట్టిపోతుంది. నివాసం కోసం ఓ గుడారం వేసుకొని అందులో వారు తలదాచుకుంటారు. వేడి కోసం కొన్ని కట్టెలను మండించి చలి కాచుకుంటారు. వీరి సమస్యను గుర్తించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వేడినిచ్చే సోలార్‌ గుడారాలను తయారుచేశాడు.
లడఖ్‌కి చెందిన సోనమ్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌ (న×Aూ) బృందంతో కలిసి సోనమ్‌ పనిచేస్తున్నాడు. అయితే గతంలో సోనమ్‌ సైన్యం కోసం చేసిన గుడారాల ప్రాజెక్టు ప్రభుత్వ అధికారుల నుంచి తిరస్కరణకు గురైంది. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి, సోలార్‌ వేడి డేరాలను తయారుచేశారు.
గల్వాన్‌ వాలీ ఎత్తైన మంచు ప్రదేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తాను ఈ పోర్టబుల్‌ సౌర వేడి గుడారాలను చేశారు. ఈ డేరా లోపల రాత్రి 10 గంటలకు 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటున్నట్లు గుర్తించాడు. బయట కనిష్ట ఉష్ణోగ్రత -14 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. దీని నిర్మాణం సౌర గృహాల మాదిరిగానే శాస్త్రీయ సూత్రాలపై నిర్మించబడింది. మామూలుగా సైన్యం ఉపయోగించే కంటైనర్‌ క్యాబిన్ల కంటే ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. అకస్మాత్తుగా సైన్యం ఒకచోట నుంచి మరొక ప్రాంతానికి వెళ్లి- కొన్ని రోజులు ఉండాల్సినప్పుడు వీటిని పట్టుకొని వెళ్లే విధంగా తక్కువ బరువును కలిగి ఉంటాయి. రాత్రి వేళల్లో లైటింగ్‌ అమర్చుకోవచ్చు. మామూలుగా డేరాల్లో నీళ్లు ఉదయానికి గడ్డకట్టేవి. కానీ ఈ సోలార్‌ వేడి గుడారంలో ఉదయం వరకూ నీళ్లు ఉన్నాయి. లోపల ఉండే వ్యక్తులను బట్టి గుడారం నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చు. సుమారు 10 మంది సైనికులు, అధికారుల కోసం 40 ముక్కల డేరా అవసరం అవుతుంది. అలా వ్యక్తులను బట్టి దీనిని విస్తరించుకోవొచ్చు.
చాంగ్‌-లా పాస్‌, ఎతైన ప్రదేశంలో పాంగోంగ్‌ సరస్సుకి వెళ్లే మార్గంలో, తీవ్రమైన చలి ప్రదేశాల్లో ఈ డేరాలను నిర్మించారు. అక్కడ వాతావరణానికి అనుగుణంగా గుడారం లోపల ఎలా ఉంటుందో పరీక్షించారు. సైన్యానికి ఉపయోగకరంగా ఉన్నట్లు నిపుణులు చెప్పారు. అధికారుల అనుమతి పొందిన తర్వాతే ఈ గుడారాల తయారీకి సోలార్‌తో పాటు ఏఏ వస్తువులను ఉపయోగించారో చెబుతానంటున్నాడు సోనమ్‌. తక్కువ ఖర్చుతో వచ్చే ఈ గుడారాలను భవిష్యత్తులో పర్యాటకులు, వ్యాపారులు, నివాసితులు కూడా వినియోగించవచ్చు.

solar