Oct 24,2021 18:44

ఫర్నిచర్‌ విరిగిపోతే పారేస్తాం. లేదా బాగు చేయించుకుంటాం. కానీ నాగరాజు దానితో ఉపయోగపడే కొత్త వస్తువు ఒకటి తయారు చేస్తున్నారు. ఖాళీ పాల ప్యాకెట్లను ఎందుకు పనికి రావని చెత్తబుట్టలో వేస్తాం. కానీ తాను మాత్రం వాటితో కవర్లు చేశారు. పర్యావరణానికి మేలు చేసే ప్రయోగాత్మక విషయాలను ఆచరణలో పెట్టడం, విద్యార్థుల చేత చేయిస్తూ... ఉత్తమ ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకున్నారు.
టీచర్లను స్కూలుకి వచ్చి పిల్లలకు అర్థవంతంగా పాఠాలు చెబుతున్నారా? లేదా అని మాత్రమే చూస్తాం. కానీ నాగరాజు మాత్రం స్కూలుకి, పిల్లలకు ఉపయోగపడే చర్యలు చేపడుతూ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు. నాగరాజు బెంగుళూరులో దొడ్డబనహల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉనుత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ప్రతి అంశాన్ని అర్థమయ్యే రీతిలో పిల్లలకు ఆసక్తి కలిగించేలా పాఠాలు చెప్పేవారు. తన బోధనల ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన కార్యక్రమాలను ప్రవేశపెట్టినందుకు అధికారులు జాతీయ పురస్కారంతో అభినందించారు. పిల్లలకు ఏ అంశం చెప్పినా అది గుర్తిండిపోయేలా ఉండాలనుదే ఆయన నమ్మిన సిద్ధాంతం. అందుకే ప్రతి విషయాన్ని ఆచరణలో చూపిస్తూ పాఠాలు చెబుతుంటారు. ఇప్పుడు నాగరాజు 8, 9, 10 వ తరగతి విద్యార్థులకు సైన్స్‌ బోధిస్తున్నారు. తన పదిహేనేళ్ల విద్యాబోధన అనుభవంలో ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు పెంచే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా పర్యావరణ చైతన్యం కల్పిస్తూ సైన్సులో వినూతు పద్ధతులను పాఠశాలలో చేపట్టి, వాటిని నిరంతరం జరిగేలా చూస్తున్నారు.
నిత్యం ప్రయోగాలు చేస్తూ...
పర్యావరణ అనుకూల జీవనశైలిని ఇష్టపడే నాగరాజుకు ఎన్నో ఆలోచనలున్నా... నిధుల కొరత వల్ల అతని ప్రాజెక్టు ఆలస్యమవడంతో నగరంలోని ఎన్‌జిఓలను సంప్రదించారు. అదే సమయంలో వ్యర్థాల నిర్వహణకు ఒక కార్యక్రమాన్ని ప్రారంచిన ఆయన.. కుర్చీలు, టేబుల్స్‌తో సహా పాత, విరిగిన మెటల్‌ ఆధారిత ఫర్నిచర్‌ను తిరిగి రూపొందించారు. బోధనా సిబ్బంది కోసం 20 విరిగిన ముక్కలను ఉపయోగించి న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌ స్టాండ్స్‌, ప్రొజెక్టర్‌ స్క్రీన్‌ ప్యాడ్‌, డయాస్‌, పోడియం, నేమ్‌ ప్లేట్స్‌, అల్మారాలుగా మార్చారు. మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు పాలు అందిస్తున్నారు. ఆ తర్వాత వృథాగా పడేస్తున్న ఖాళీ పాల ప్యాకెట్లతో పాఠశాలలోని20 కంప్యూటర్లకు కవర్లను తయారు చేయించారు. నాగరాజు చేపడుతున్న ఈ కార్యక్రమాలను చూసి ఐదు ఎన్జీవోలు స్ఫూర్తి పొందాయి.

సైన్సుతో పర్యావరణ చైతన్యం
సమీప పొలాల నుంచి సేకరించే ఆకులు, వ్యవసాయ వ్యర్థాలు వంటి బయోవేస్ట్‌ కోసం ఒక గుంటను, పాఠశాల వంటగదిలో ఉత్పత్తయ్యే ఆహార వ్యర్థాల కోసం మరొక గుంటను ఏర్పాటు చేశారు. అందులో 6-8 నెలల్లోనే 1 టన్ను ఎరువును ఉత్పత్తి చేశారు. ఇక ఏడాది కాలంలో సేకరించిన 58 కిలోల ప్లాస్టిక్‌, పేపర్‌ వ్యర్థాలను స్థానిక రీసైక్లర్‌కు ఇచ్చారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, వ్యర్థ జలాలను నిల్వ చేయడానికి ఐదు భూగర్భ జలాల రీఛార్జింగ్‌ గుంటలు ఉన్నాయి. శుద్ధి అయిన నీటినిపాఠశాలలో పాత్రలు కడిగేందుకు, మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగిస్తారు. వ్యర్థాలను సురక్షితంగా పారేయడం, పునర్వినియోంచడాన్ని అలవాటుగా చేసుకును నాగరాజు వాడిపడేసిన సీసాలను ఉపయోగించి విద్యార్థుల కోసం కెమిస్ట్రీ కిట్లను తయారుచేసి ఇచ్చారు. ఇంట్లో కూడా రసాయన ప్రయోగాలు చేయడానికి వీలుగా విద్యార్థులు ఉపయోగించే చిను పోర్టబుల్‌ కిట్‌లను తయారుచేశారు.
విద్యా బోధనలో నాగరాజు కృషిని, పాఠశాలలో అనుసరిస్తున్న పర్యావరణహిత చర్యలను విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు గుర్తించి, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సన్మానించింది.

సైన్సుతో పర్యావరణ చైతన్యం