Dec 05,2021 19:23

ప్రస్తుతం ఒకపక్క సమాజంలో వేళ్లూనుకొన్న సమస్యలపై చిత్రాలు తెరకెక్కుతూ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. చైతన్యవంతం చేస్తున్నాయి. మరోపక్క ఇంకొన్ని సినిమాలు మూఢభక్తిని, అజ్ఞానాన్నీ పెంచి పోషించే ఇతివృత్తాలతో తిరోగమన బాట పట్టిస్తున్నాయి. గతంలో ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల కోసం భక్తి చిత్రాలను విరివిగా నిర్మించడం కనిపించేది. తెరపై కనిపించే దేవుళ్లకు ప్రార్థనలు చేయడం, థియేటర్ల ముందు విగ్రహపూజలు, పువ్వులు, కొబ్బరికాయల కొట్లు వెలవడం చూశాం. అవి కొన్ని కథలకు పరిమితమై సాగేవి. వర్తమాన అంశాలపై వ్యాఖ్యానించకుండా నడిచేవి. ఆ జోనర్‌ వేరు కాబట్టి, ఆ పరిమితులకు లోబడే ప్రేక్షకాదరణ కూడా ఉంటుంది.

సైన్సును వాడుకుంటూ.. మూఢత్వ ప్రచారమా?
కానీ, వర్తమాన అంశాలపై వ్యాఖ్యానిస్తూ మూఢత్వాన్ని బలంగా చాటాలనుకోవటం ఈ శాస్త్ర సాంకేతిక యుగంలో ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇటీవల బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చిన అఖండ ఈ తరహా ధోరణితో నిర్మితమైంది. కథాపరంగా పెద్దగా అవసరం లేకుండానే దేవుళ్లను, హిందూత్వని సంభాషణల్లో బలంగా వినిపించారు. ధర్మాన్ని కాపాడ్డానికి హింస కూడా గొప్ప ధర్మమని, చట్టాలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా ఇకపై అలాగే కొనసాగుతుందని ప్రధాన పాత్ర చేత అనిపించారు. అధికార యంత్రాంగం, ఇతర జనసమూహం చేష్టలుడిగి చేతులు కట్టుకొని నిలబడితే .. మహత్తర శక్తితో ప్రతినాయక గణాన్ని ఒంటి చేత్తో అఖండ మట్టుపెడతాడు. బోయపాటి శ్రీను ఈ వాస్తవాతీత వీరోచితం సహజమే అయినప్పటికీ- ఈసారి మూఢత్వాన్ని కూడా గట్టిగా వినిపించాడు. ప్రేక్షకుల భావోద్వేగాలను తీవ్రతరం చేసే ఈ తరహా సినిమాల్లో గతంలో చాలా వచ్చాయి. కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'అమ్మోరు' ప్రేక్షకుల భావోద్వేగాల మీద ప్రచారం పొందింది. ఆ తరువాత ఆ కోవలో కొన్ని సినిమాలు వచ్చినా అంతగా ఆడలేదు.
కొంతమంది దర్శకులు తమ హీరోలను అత్యంత బలవంతుడిగా చూపించే ప్రయత్నంలో భాగంగా లా అండ్‌ ఆర్డర్‌ కూడా తనని ఏమీ చేయదన్నట్లుగా చూపించడం ఎక్కువైంది. అఖండలో బాలకృష్ణను అఘోరాగా చూపిస్తూ విపరీతమైన హింసను ప్రోత్సహించారు. ఆ హీరో ఎవరినైనా చంపొచ్చు, పోలీసులు, చట్టం అతన్ని ఏమీ చేయదన్నట్లు చూపించడం వెనుక ప్రేక్షకులకు ఏం చెప్పదల్చుకున్నారు? ఈ తరహా సినిమాల వల్ల ఎవరైనా ఎవరినైనా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఎదిరిస్తే చంపొచ్చు అన్నదే ఇతివృత్తంగా కనిపిస్తోంది. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు.
అంతగా ప్రజాదరణ లేని దర్శక నిర్మాతలు, జూనియర్‌, సీనియర్‌ ఆర్టిస్టులతో అతీంద్రియ శక్తులు, మూఢభక్తి వంటి అంశాలతో సినిమాలు తీసినా పట్టించుకోనక్కర్లేదు. కాని కోటానుకోట్ల రూపాయల బడ్జెట్‌తో, ప్రముఖ హీరోలు, హీరోయిన్లు ప్రధాన తారాగణంగా అటువంటి సినిమాలు తెరకెక్కిస్తే ఆశ్రమాల్లో స్వాములు, బాబాలు బోధించే మూఢభక్తి, తెరపై అత్యంత కమర్షియల్‌గా ప్రతిబింబింబించడమే అవుతుంది. యువతను పెడదోవ పెట్టించే, మహిళలను కించపరిచే సినిమాలు తెరకెక్కుతున్నాయని, సమాజాన్ని పక్కదోవ పట్టించే ఈ తరహా సినిమాలు నిషేధించాలని అడపాదడపా ఆందోళనలు జరుగుతుంటాయి. కాని మూఢభక్తిని పెంచి పోషించే సినిమాలపై చాలామంది మాట్లాడరు. భావోద్వేగ అంశం వర్తమాన అంశాలకు ముడిపెట్టినప్పుడు అది ఎక్కువగా ప్రభావితం చేస్తుందనేది దర్శక, నిర్మాతలు గ్రహించినప్పుడే ఈ తరహా సినిమాలకు అడ్డుకట్ట పడుతుంది. హీరోయిజం చూపించడమంటే లెక్కలేనితనం కాదు. సినిమా అంటే భావోద్వేగాలను స్పృశించే అత్యంత శక్తివంత సాధనమని గుర్తించి, ఇకముందైనా ప్రజలను, ప్రేక్షకలోకాన్ని మంచి మార్గంలో నడిపించే చిత్రాలు రావాలి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుంటూ మళ్లీ దానిని కించపరిచే, తక్కువ చేసే భావజాలాన్ని ప్రచారం చేయడం ఎంతమాత్రమూ సమజంసం కాదు.