
ప్రజాశక్తి-కాకినాడ రూరల్ : కాకినాడ తీరంలో జలప్రహార్-2020 యాంపీబీయస్ పేరుతో నిర్వహించిన త్రివిధ దళాల విన్యాసాలు ఆదివారంతో ముగిశాయి. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకినాడ సముద్ర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులు, ఫిరంగుల దాడులు శనివారం మొదలుకుని ఆదివారంతో ముగిశాయి. విన్యాసాలు ఈ నెల 26-28 వరకు బీచ్లో జరగాల్సి ఉండగా నివర్ తుపాను కారణంగా ప్రతికూల పరిస్థితులతో మొదటి రెండు రోజులు బీచ్లో ఎటువంటి విన్యాసాలూ నిర్వహించలేదు. ఉగ్రవాదులను మన భూభాగం నుంచి తరిమికొట్టేందుకు భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగిన విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి. తూర్పు నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావత్ యుద్ధనౌకలతో పాటు నేవీ, ఆర్మీ సిబ్బంది దురాక్రమణ, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకు నేందుకు విన్యాసాలు చేశారు. ఐఎన్ఎస్ జలాశ్వ నుంచి సిబ్బంది, హెలికాప్టర్లు, విమానాలు, యుద్ధ ట్యాంకర్లు దింపారు. బంకర్లలలో ఆర్మీ సిబ్బంది అధునాతన ఆయుధాలతో జల, భూఉపరితలం, ఆకాశమార్గాల ద్వారా శత్రువుల శిబిరాలపై ఫిరంగులు, ఆయుధాలతో దాడులు వంటి విన్యాసాలు చేశారు. ఒక వైపున బీచ్లో యుద్ధట్యాంకర్లు, ఫిరంగులు, మరో పక్క ఆర్మీ సిబ్బంది ఆయుధాలు చేతబట్టి తీరంలో గస్తీ, మరో వైపు సముద్రంపై నుంచి నావికాదళం విన్యాసాలు కనువిందు చేశాయి. సముద్రంలో నుంచి బోట్లలలో వచ్చిన కమాండోలు ఆపరేషన్ చేపట్టారు. ఆకాశమార్గాన శత్రు శిబిరాలపై హెలికాప్టర్ల ద్వారా దాడులు, నేవీ క్రాస్ డెకింగ్, ఆర్మీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యుద్ధ నౌకలు, త్రివిధ దళాల ట్రూప్స్ ఆదివారం గమ్యస్థానాలకు తిరుగుముఖం పట్టాయి. డిఎస్పి వి.భీమారావు ఆధ్వర్యాన బందో బస్తు నిర్వహించినట్టు సిఐ మురళీకృష్ణ తెలిపారు.