Nov 22,2020 19:31

ముంబయి : మోడీ సర్కార్‌ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, రైతాంగ లోకం సిద్ధమౌతోంది. మహారాష్ట్రలో ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి ప్రజల ధర్మాగ్రహాన్ని కేంద్రానికి తెలియజేందుకు కార్మికులు, రైతులు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు సన్నద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వేలాదిమంది సమ్మెలో పాల్గనే అవకాశం ఉన్నట్లు అంచనా. సమ్మె రోజైన గురువారం రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలను సంపూర్ణ షట్‌డౌన్‌ చేయాలని కార్మిక సంఘాలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. సమ్మెలో వ్యవస్థీకృత రంగంలోని కార్మికులతోపాటు మున్సిపాలిటీ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగ స్థానాల నుంచి పలు రూపాల్గో పాల్గననున్నారు. 26, 27న రైతులు రాష్ట్రం నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు.
        సమ్మె సన్నద్ధతలో భాగంగా శనివారం ఎఐకెఎస్‌కు చెందిన అశోక్‌ ధవాలే, రైతు నాయకుడు రాజు శెట్టి, సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్‌, ఐఎన్‌టియుసి నేత జైప్రకాశ్‌ ఛాజెద్‌, ముంబై యూనియన్‌ నాయకుడు శంకర్‌ సాల్వి, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు ఉదయ్ భట్‌, జన్‌ ఆందోళనాన్చి సంఘర్ష్‌ సమితి (జెఎఎస్‌ఎస్‌) కన్వీనర్‌ విశ్వాస్‌ ఉటాగి పాల్గొన్నారు. సమ్మె రోజున చేపట్టిన కార్యక్రమాలపై వీరు చర్చించారు. రాష్ట్రంలోని ప్రతి తహశీల్‌ కార్యాలయం వద్ద రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆశోక్‌ ధవాలే పేర్కొన్నారు. రెండు రోజుల ఆందోళనల్లో భాగంగా వేలాది మంది రైతులు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలిపారు. ఇక్కడి ఆందోళనల్లో కూడా పాల్గని నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఆందోళనలకు సన్నద్ధమౌతున్నట్లు విశ్వాస్‌ పేర్కొన్నారు. సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు పాల్గనేలా యూనియన్ల నాయకులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
         ఈసారి వీధి వ్యాపారుల యూనియన్లు, రియల్‌ ఎస్టేట్‌ కార్మికుల యూనియన్లు, అన్ని మార్కెట్‌ కమిటీల్లోని హమాలీ యూనియన్లు కూడా తమ నిరసన తెలపనున్నారని 'సర్వ శ్రామిక్‌ సంఘటన' నేత ఉదరు భట్‌ న్యూస్‌క్లిక్‌కు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా అవ్యవస్థీకృత రంగం దారుణంగా దెబ్బతిన్నదని, ఇటువంటి సమయంలో అందులో పనిచేసే కార్మికులకు నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మిక, రైతుల, ఇతర వర్గాల ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 26న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు సర్కార్‌కు ఒక హెచ్చరికగా ఉంటుందని అన్నారు. నర్మద డ్యామ్‌ ప్రాజెక్టుతో నష్టపోయిన వారందరూ సమ్మెలో పాల్గనాలని మేధాపాట్కర్‌ పిలుపునిచ్చారు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేదలను మరింత పేదలుగా చేసేవిగా ఉన్నాయని విమర్శించారు. దేశ ఆస్తుల దోపిడీ, ప్రజల, కార్మిక హక్కులపై ప్రభుత్వం చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మె ఆరు తీరప్రాంత జిల్లాలోని మత్స్యకారులు కూడా మద్దతు తెలుపుతున్నట్లు ఫిషర్‌మెన్‌ యాక్షన్‌ కమిటీ కార్యదర్శి మహేంద్ర తెలిపారు.