May 18,2021 22:54

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జివిఎంసి కమిషనర్‌ సృజన

మద్దిలపాలెం : నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదేశించారు. శానిటేషన్‌పై అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్‌లతో మంగళవారం తన ఛాంబరు నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. డోర్‌ టు డోర్‌ వెళ్లి చెత్తను ఏ విధంగా నిర్వహిస్తున్నది, తడి-పొడి చెత్త సేకరణ అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, దుకాణాల వద్ద మూడు చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని, అలా లేని దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. పెద్ద పెద్ద కాలువలలో పూడిక తీత పనులపై కమిషనర్‌ ఆరా తీశారు. కరోనా వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రధాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రతి వార్డులో రద్దీ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని, బ్లీచింగును చల్లించాలని అధికారులను ఆదేశించారు.