Jul 31,2021 06:29

రకరకాల జెండా కర్రలు
వివిధ కోణాల్లో ఎజెండాలు
రంగు రంగుల పథకాలు
చెంగు చెంగున ఎగిరి దూకే
ఒట్టి మాటల జింకలు
సవాళ్లు విసుర్లు
ఆనవాళ్లు లేని వాగ్ధానాలు
తిరునాళ్ళులో రంగు బిళ్లలు
నాగరికం పడగలిప్పి
బుసులు కొడుతుంటే
శాంతి పావురం ఉలిక్కిపడి
శూన్యం లోకి ఎగిరింది
తొడుగులేసిన వర్గాలు
మడుగులొత్తిన ఆర్థికాలు
రాబడి లెక్కల విన్యాసాలు
బడుగు బతుకు పోరాటాలు
దారులపై నిరసనల ధూళి
కర్షకుని చేతిలో
కోతకు పనికిరాని కొడవలి
కళ్లెం తొడిగిన స్వేచ్ఛ
రగులుతున్న కోతల దీక్ష
కాలం గబ్బిలమై వేలాడుతూ
లోకానికి రేచీకటి వచ్చాక
శాంతి కరువైన నేలపై నుండి
పావురం పైపైకెగిరింది
చుట్టూ ఆశల వలయాలు
అర్థం కాని రాజకీయ ఘట్టాలు
ప్రశ్నే లేని జవాబుదారీతనం
ఒక రూపం లేని పరిపాలనం
పునాదుల్లేని సమాజ నిర్మాణంపై
గుండె లేని దేహపు కుటీరంలో
స్వార్థపు మెతుకులు మింగలేక
శాంతి పావురం నేలను వదిలి
నింగికెగిరిపోయింది.
 

- నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636