Mar 02,2021 21:46

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ కృష్ణారావు

బెలగాం: క్షౌరవృత్తిదారులకు రక్షణ కల్పించేలా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు కోరారు. బెలగాం చర్చి కూడలి వద్ద గల గిరిజన సామాజిక భవనంలో మంగళవారం క్షౌరవృత్తి దారుల సంఘం జిల్లా అధ్యక్షులు టివి దుర్గారావు అధ్యక్షతన రెౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపిడిఒ కె.కృష్ణారావు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.సూరిబాబు మాట్లాడుతూ సమాజంలో క్షౌరవృత్తిదారులపై కుల వివక్ష, చిన్న చూపు ఎక్కువగా ఉందని, దీనికి వల్ల మనలో ప్రశ్నించే తత్వం లేకపోవడమే నన్నారు. పట్టణాల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా గ్రామాల్లో చాలా దారుణంగా ఉందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సాంఘిక బహిష్కరణ, దాడులు చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉందని, హక్కులకు భంగం కలిగితే మౌనం వహించకుండా ప్రశ్నించే దిశగా ఎదగాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పి.రంజిత్‌కుమార్‌, క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.గౌరీశ్వరరావు, పార్వతీపురం డివిజన్‌ నాయకులు ఎ.జగన్నాథం, బి.వెంకటరమణ, ఎస్‌.చిన్నారావు, సాగర్‌, అలజంగి ధనుంజయరావు, బి.శంకరరావు, ఎ.సాయి, ఎం.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.