Nov 30,2020 21:22

షాహిదా కటుంబ సభ్యలను పరామర్శిస్తున్న ఐద్వా నాయకులు

   ప్రజాశక్తి-కళ్యాణదుర్గం : ఉన్మాది చేతిలో హత్యకు గురైన షాహిదా కుటుంబ సభ్యులను ఐద్వా, ఏపీ మహిళా సంఘం నాయకులు పరామర్శించారు. సోమవారం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలోని బాధితురాలి కుటుంబ సభ్యులను ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఏపీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు వరలక్ష్మిలు పరామర్శించారు. ఘటన జరిగిన తీరు, పోలీసలు తీసుకుంటున్న చర్యలపై వారితో మాట్లాడారు. షాహిదా ఘటనలో న్యాయం జరిగే వరకు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కళ్యాణదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం దిశ చట్టాన్ని ప్రవేశపెట్టింది కానీ, పార్లమెంటులో దానిని ఆమోదించలేదన్నారు. పూర్తి స్థాయిలో చట్టాన్ని చేయకపోవడం వల్లే మహిళలు, యువతులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. చాపిరి గ్రామంలో హత్యకు గురైన షాహిదా ఘటన అత్యంత విచాకరం అన్నారు. మూడు రోజుల్లో వివాహం జరగాల్సిన యువతిని కొందరు ఉన్మాదులు తీసుకెళ్లి హత్య చేశారన్నారు. హత్యకు ముందు యువతిని చిత్రహింసలకు గురి చేశారన్నారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్నారు. ప్రధాన నిందితుడు రఘుతో పాటు ఇందులో పాల్గొన్న నిందితులు, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.