Oct 14,2021 21:11

లఖింపూర్‌ హింస కేసు దర్యాప్తుపై రాకేశ్‌ తికాయిత్‌ అసంతృప్తి
వాజ్‌పేయి ప్రసంగం క్లిప్‌ను ట్వీట్‌ చేసిన వరుణ్‌ గాంధీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  లఖింపూర్‌ ఖేరీ హింసాకాండపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా, మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికోనియా గ్రామంలోని సంఘటనా స్థలికి తీసుకెళ్లింది. గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా-బన్‌బీర్‌పూర్‌ రహదారిపై జరిగిన సంఘటనా స్థలానికి తీసుకెళ్లి, సీన్‌ రీకనస్ట్రక్షన్‌ చేశారు. ఆశిష్‌ మిశ్రాకు స్థానిక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
వాజ్‌పేయి ప్రసంగం క్లిప్‌ను ట్వీట్‌ చేసిన వరుణ్‌ గాంధీ
బిజెపి ఎంపి వరుణ్‌ గాంధీ గురువారం ట్విట్టర్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేశారు. 'రైతులను ప్రభుత్వం అణచివేస్తే, చట్టాలను దుర్వినియోగం చేసి, శాంతియుత ఆందోళనను అణచివేస్తే, రైతుల పోరాటంలో పాల్గనడానికి, వారితో నిలబడటానికి మేం వెనుకాడం'' అని వాజ్‌పేయి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హెచ్చరించడం ఆ వీడియోలో ఉంది. 'ఒక పెద్ద మనసున్న నాయకుడి తెలివైన మాటలు ...' అని ట్విట్టర్‌లో వరుణ్‌ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ ద్వారా నల్లచట్టాలపై మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లయింది.
లఖింపూర్‌ హింస కేసు దర్యాప్తుపై రాకేశ్‌ తికాయత్‌ అసంతృప్తి
లఖింపూర్‌ హింస కేసుపై కొనసాగుతున్న దర్యాప్తుపై రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్‌ని ''రెడ్‌ కార్పెట్‌ అరెస్ట్‌'' చేయడం నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల్లో ఆగ్రహాన్ని పెంచిందని అన్నారు. అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడి తండ్రి ఆ కుర్చీలో కొనసాగితే కేసులో న్యాయమైన దర్యాప్తు జరగదని, న్యాయం జరగదని ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటుందని తెలిపారు. సిట్‌ దర్యాప్తుపై మంత్రి ప్రభావం చూపుతున్నారని విమర్శించారు. అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించకపోతే లఖింపూర్‌ హింసకు వ్యతిరేకంగా నిరసన తీవ్రతరం అవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.