
న్యూఢిల్లీ : అడ్డగోలు వడ్డీ వసూళ్లతో ఖాతాదారులను తీవ్ర ఒత్తిడి, ఆత్మహత్యలకు గురి చేస్తోన్న డిజిటల్ రుణ యాప్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఎట్టకేలకు దృష్టి సారించింది. ఈ రుణ యాప్‌లపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో డిజిటల్ రుణాలు ఇచ్చే మొబైల్ యాప్స్ వాడకం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలను నివారించేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్ రుణాలను ఈ గ్రూప్ పరిశీలిస్తుందని వెల్లడించింది. అదే విధంగా డిజిటల్ రుణాల లోటుపాట్లపై కూడా అధ్యయనం చేస్తుందని పేర్కొంది. ఆర్థికరంగంలో వివిధ డిజిటల్ పద్ధతుల ద్వారా అభివఅద్ధిని వేగవంతం చేయడమనేది అహ్వానించదగినదేనని.. అయినప్పటికీ దీని వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని పేర్కొంది. దీన్ని సమన్వయం చేయడానికి తగిన విధంగా నియమ, నిబంధనలు తయారు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.