
గుడివాడ : ఇటీవల కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన వరి పంట నీట మునిగి రైతులు, కౌలు రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం, 25కేజీలు మినుములను ఉచితంగా అందించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్ధానిక ఆర్డివో కార్యాలయం ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద కౌలు రైతు లకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయంలో భైఠాయించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం, 25 కేజీల మినుములు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. జెఎల్జి గ్రూపుల ఏర్పాటు తదితర సమస్యలపై ప్రభుత్వం కౌలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. పొలలలో ఫోటోలకు కౌలు రైతులు ఉంచి పేర్లు మాత్రం రైతులవి వ్రాయటం దారుణమన్నారు. ఈ-క్రాఫ్ బుక్కింగ్లో యాడ్ ఫార్మర్ ఆప్షన్ వున్నా అధికారులు దానిని ఉపయోగించకుండా ఇప్పుడు కౌలు రైతుల పేర్లు లేవని చెప్పడం కౌలు రైతులను మోసం చేయడమేనన్నారు. తడిసిన ధాన్యాన్ని 17% తేమ మాత్రమే అనుమతిస్తామనడం తుఫాను సమయంలో ఎలా సాధ్యమన్నారు. నిబంధనలు మార్చి మొత్తం కౌలుదారుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన వ్యవసయా శాఖ ఎ.డి.ఎ ఎన్.రమాదేవి మాట్లాడుతూ
ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి వీలున్నంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం ఉదతం చేస్తామని జమలయ్య హెచ్చరించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి ఎన్.మురళీకష్ణారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.వి శ్రీనివాసరావు, నాయకులు ప్రసాద్, ఉమామహేశ్వరరావు, కౌలు రైతు సంఘం గుడివాడ మండల కార్యదర్శి లేళ్ళ రాంబాబు, పెదపారుపుడి మండల ఉపాధ్యక్షుడు జోజి, తమిరిశ నాయకులు శేషగిరిరావు, జొన్నపాడు, గురివిందగుంట, తమిరిశ తదితర గ్రామాల కౌలు రైతులు పాల్గొన్నారు.