Dec 04,2021 07:42
  • ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌కు హెల్త్‌ వర్శిటీ రిజిస్ట్రార్‌ లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బాస్‌ చెప్పారంటూ 400 కోట్ల రూపాయలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు (ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌)కు బదిలీ చేసిన ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఉన్నతా ధికారులకు రోజువారీ ఖర్చులకు కూడా వెతుక్కో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల నిరసనను భేఖాతరు చేసి ఏ సంస్థకైతే నిధులు పంపించారో ఆ సంస్థనే అధికారులు ఇప్పుడు బతిమలాడుకుంటు న్నారు. 'ముందు చూపులేకుండా మీకు రూ.400 కోట్లు ఇచ్చేశాం. వర్శిటీ కార్యకలాపాల గురించి ఆలోచించకుండా ఆ పనిచేశాం.
     తక్షణమే 175 కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వండి' అని ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ శుక్రవారం ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌కు లేఖ రాశారు. 'ఆడిటర్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించి చెబితేగానీ వర్శిటీ ఆర్థిక ఇబ్బందుల్లో పడిందనే విషయం మాకు తెలియలేదు.' అని ఈ లేఖలో పేర్కొనడం విశేషం. 'అడకమిక్‌ యాక్టివిటీస్‌తో పాటు ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ కోర్సులలో ప్రవేశం కోసం కౌన్సెలింగ్‌ వంటి వర్శిటీ కార్యకలాపాలకు ఈ ఏడాది వందకోట్లు కావాలి. ఉద్యోగుల జీత భత్యాలు, ఫించన్ల చెల్లింపులకు మరో 75 కోట్లు అవసర మవుతాయి. ఆ మొత్తాన్ని వెంటనే ఇవ్వండి' అని లేఖలో కోరారు. మిగిలిన మొత్తానికి 5.5 శాతం వడ్డీ చెల్లించాలని రిజిస్ట్రార్‌ కోరారు.
 

                                                      దేనికెంత కావాలో చెప్పండి...!

వర్సిటీ రిజిస్ట్రార్‌ రాసిన లేఖపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పందించినట్లు తెలిసింది. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి శ్యామ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె శంకర్‌తో మాట్లాడిన ఆయన ఏ హెడ్‌కు ఎంతెంత మొత్తం అవసరమవుతుందో వివరాలు తెలపాలని ఆదేశించారు. దీంతో వర్సిటీ అధికారులు ఆ దిశలో కసరత్తు చేస్తున్నారు.
 

                                        ఉద్యోగుల ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

నిధుల మళ్లింపునకు వ్యతిరేకంగా హెల్త్‌ యూనివర్సిటీ ఉద్యోగుల జెఎసి చేపట్టిన ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యకడు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వర రావు, జిల్లా నాయకుడు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ సంఘీభావం ప్రకటించారు. ఎపి ఎన్‌జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్య దర్శి శివారెడ్డి, పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌ తదితరులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు.