Jul 30,2021 21:11

ప్రజాశక్తి-విజయవాడ : పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో కార్పొరేటర్లు, అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో విద్యాధరపురం స్టేడియంపై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా డిజైన్లను మంత్రి వెల్లంపల్లికి వివరించారు. అధికారులు రూపొందించిన డిజైన్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి పలు సూచనలు చేశారు. ఇండోర్‌ స్టేడియంతోపాటు బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, క్రికెట్‌, షటిల్‌ కోర్టు, వాల్‌ టు వాల్‌ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం, యోగా, ఓపెన్‌ జిమ్‌, పుడ్‌ కోర్టు వంటి పలుర కాల ఆటలు విడివిడిగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఆధునిక హంగులతో స్టేడియం నిర్మాణం చేపట్టాలన్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, పలువురు కార్పొరేటర్లు, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం ప్రభాకరరావు, ఎస్‌ఇ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.