Nov 30,2020 21:21

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి : వ్యవసాయ పరిశోధన కేంద్రంలో దినసరి కూలీలుగా పని చేస్తున్న కార్మికులకు రోజుకు రూ 600 కూలి ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు సోమవారం స్థానిక వ్యవసాయ పరిశోదన కేంద్రం, ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులతో కలసి రీసెర్చ్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె శివశంకర్‌ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్మోహన్‌, హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ గత 20సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోదన కేంద్రంలో పలువురు దినకూలీలుగా పని చేస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దినకూలి రూ.600 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామమోహన్‌, కార్మికులు శ్రీనివాసులు, గౌసియా, ఫాతిమా, రమణమ్మ, రామంజులమ్మ తదితరులు పాల్గొన్నారు.