Jan 16,2021 13:42

బ్రిస్బేన్‌ : టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మను ఇండియన్‌ క్రికెటర్‌ ట్రోల్‌ చేశాడు. ట్రోల్‌ అంటే అదేదో విమర్శలు గుప్పిస్తూ కాదు.. సరదాగా చేశాడు. బ్రిస్బేన్‌ వేదికగా కబ్బా స్టేడియంలో నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసందే. అయితే మొదటి రోజు మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. ఆ ఓవర్‌లో మరో బంతి మిగిలి ఉండగానే గాయంతో నవ్‌దీప్‌ సైనీ మైదానం వీడాడు. దీంతో ఆ ఓవర్‌లో మిగిలిపోయిన చివరి బంతిని రోహిత్‌ శర్మ బౌలింగ్‌ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ సరదాగా రోహిత్‌ శర్మపై ట్రోల్‌ చేశాడు. టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి రోహిత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్‌ బౌలర్‌ వచ్చాడంటూ ముగ్గురినీ ట్యాగ్‌ చేసి ఓ జిఫ్‌ఫైల్‌ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ దినేశ్‌ కార్తీక్‌ ఆ పోస్టును తొలగించాడు. అప్పటికే అది వైరల్‌గా మారింది.