Sep 20,2021 01:01

అర్తమూరులో రోడ్డులో చెత్తాచెదారం

ప్రజల అవస్థలు
ప్రజాశక్తి-మండపేట

మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్చభారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌, మనం-మన పరిశుభ్రత, వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంతోపాటు పారిశుధ్యంపై అవగాహన వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పారిశుధ్యం మెరుగు పడటంలేదు. సమస్య నానాటికీ తీవ్ర రూపం దాలుస్తోంది, ఆహ్లాదకరంగా ఉండాల్సిన రహదారులు, కాలువ గట్లు డంపింగ్‌యార్డులుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో తాము వ్యాధులబారిన పడుతున్నామని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు. ఇవి కుక్కలకు, పందులకు, దోమలు, క్రిమికీటకాలకు ఆవాసాలుగా మారుతుండటంతో రాత్రి సమయాల్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితి దాదాపు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్నప్పటికి అర్తమూరు, తాపేశ్వరం, ఏడిద సీతానగరం, ద్వారపూడి గ్రామాల్లో అధికంగా ఉంది. గ్రామాల్లో రోడ్ల, కాలువల వెంబడి ఉన్న చెత్తాచెదారాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. రహదారులు వెంబడి చెత్త వేసి నిప్పు పెడుతుండటంతో ఆ రోడ్లపై ప్రయాణించే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారుతున్నా సమస్యల పరిష్కారానికి నోచుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. మూతపడ్డ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను తెరిచి, చెత్తను అక్కడికి తరలించాలని కోరుతున్నారు. పచ్చదనం, పరిశుభ్రతను కాపాడే విధంగా అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.