Dec 03,2021 20:15

ప్రజాశక్తి-లఖ్‌నపూ :అపహరణకు గురైన బాలికను రక్షించేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌ మధురాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ తికమ్‌గఢ్‌ జిల్లాలోని బుదేరా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్‌ సిబ్బంది స్థానికంగా కాడ్నాప్‌ అయిన ఓ బాలికను రక్షించేందుకు హరియాణాలోని బహదూర్‌గఢ్‌కు ఎస్‌యూవీలో బయల్ధేరారు. బాలికను కాపాడేందుకు సాయంగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని తీసుకెళ్లారు. మార్గమధ్యలో మధుర వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢకొీట్టినట్లు తికమ్‌గఢ్‌ అదనపు ఎస్పీ ఎంఎల్‌ చౌరాసియా తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో హెడ్‌ కానిస్టేబుల్‌ భవానీ ప్రసాద్‌(52), కానిస్టేబుళ్లు హీరాదేవి ప్రజాపతి (32), కమలేంద్ర యాదవ్‌ (28)తోపాటు వారికి సాయంగా వెళ్తున్న ప్రీతి, ధర్మేంద్ర కూడా మృతి చెందినట్లు ఏఎస్పి వెల్లడించారు. ఇదే ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌తోపాటు డ్రైవర్‌, మరొకరికి గాయాలైనట్లు చెప్పారు. ఈ ముగ్గురిని వెంటనే మధురలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.