Mar 02,2021 21:56

ట్రాఫిక్‌ నియంత్రణ పరికరాలు అందజేస్తున్న ఎస్‌పి

కంటోన్మెంట్‌: రోడ్డు ప్రమాదాల నియంత్రణను అందరూ సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని ఎస్‌పి బి.రాజకుమారి తెలిపారు. 'రోడ్డు ప్రమాదాలు నివారణ-ట్రాఫిక్‌ నియంత్రణ' లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ పరికరాల పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌పి మాట్లాడుతూ ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ అన్నది పోలీసులు నిర్వహించే విధుల్లో ముఖ్యమైన అంశమని అన్నారు. ట్రాఫిక్‌ ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాల న్నారు. ఎవరి పరిధిలో వారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై అపరాధ రుసుం విధించేటప్పుడు వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పోలీసు అధికారులు కూడా స్వచ్ఛందంగా ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని, ప్రజలు, స్వచ్చంద సంస్థలను భాగస్వామ్యులను చేయాలని అన్నారు. డిజిపి గౌతం సవాంగ్‌ చొరవ చూపడంతో జిల్లా పోలీసుశాఖకు ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు అవకాశం లభించిందన్నారు. దీంతో ప్రప్రధమంగా రూ.11లక్షల వ్యయంతో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు ఉపయోగపడే 13రకాల వస్తువులు, పరికరాలను కొనుగోలు చేశామన్నారు. వీటిని ట్రాఫిక్‌ పోలీసు స్టేషనుతోపాటు, జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానంగా ఉండే పోలీసు స్టేషన్లుకు త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒఎస్‌డి ఎన్‌.సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ట్రాఫిక్‌ డిఎస్పీ ఎల్‌.మోహనరావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్‌ కుమార్‌, ఎఆర్‌ డిఎస్పీ ఎల్‌.శేషాద్రి మాట్లాడారు. పలువురు సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.