Apr 18,2021 15:51

ఆకులపై అందమైన రంగులు చిలికినట్లు, ఆకట్టుకునే డిజైన్లు అద్దినట్లు ఉండటమే ఈ మొక్కల ప్రత్యేకత. అవే కోలియాస్‌ మొక్కలు. వాటిని చూస్తే మనసు పులకించిపోతుంది. వీటి ఆకుల చివర రంపం పళ్లులా ఉంటాయి. ఈ మొక్క, కాండము, ఆకులు చూడటానికి తోటకూర మాదిరిగా ఉంటాయి. కోలియాస్‌ మొక్కల పరిచయమే ఈ వారం విరితోట...

   ఇవి అడుగు నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. ఇవి ఉష్ణమండలపు మొక్కలు. 60 డిగ్రీల వేడిని సైతం తట్టుకోగలవు. 20 డిగ్రీల కంటే తక్కువ వేడి ఉంటే ఈ మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. వాతావరణం వేడిగా ఉంటే రోజూ రెండుసార్లు, చల్లగా ఉంటే మూడురోజులకు ఒకసారి నీళ్లుపోయాలి. మట్టి తడిగా కాకుండా, పొడిగా గుల్లగా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి. అప్పుడు చిన్ని ట్రిగ్‌ వచ్చి దానికి చిన్న చిన్న నీలం లేదా పింక్‌ పువ్వులు పూస్తాయి. అవి కాస్త దళసరిగా ఉంటాయి.
   వీటి ఆకులు మామూలు ఆకుల్లా కాకుండా కొంత విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టే జంతువులు అంత త్వరగా వీటిని తినవు. వీటిని కుండీల్లో వేసి, సెమీషేడ్‌గా పెంచుకోవచ్చు. కాకపోతే మొక్క వాడినప్పుడల్లా ఎండలో ఉంచుకోవాలి. ఆరుబయట కోలియాస్‌ మొక్కలు బాగా పెరుగుతాయి. వీటిని బోర్డర్‌ ప్లాంటుగానూ పెంచుకోవచ్చు. ఇబ్బడిముబ్బడిగా పెరిగే వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచుకుంటుంటారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, ఇంటి పెరటి, పార్కులు, థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ మొక్కలు పెంచుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి.
   తెల్లదోమ, చిన్న బొద్దింకలు, బూజు, తెగుళ్లు వంటివి శీతా, వర్షాకాలంలో ఈ మొక్కలకు వచ్చే ప్రమాదం ఉంది. వేపనీళ్లు పిచికారీ చేసి, ఎండలో ఉంచడం ద్వారా అవి రాకుండా నివారించవచ్చు. వీటిని నర్సరీల్లో చిన్న చిన్న మొక్కలుగా కొనుగోలు చేసి, పెంచుకోవచ్చు. లేదా తేమ ఉన్న గుల్ల నేలల్లో విత్తనాలు చల్లి, మొక్కలు పెంచుకోవచ్చు. విత్తనాలు చల్లిన నేల మీద ప్లాస్టిక్‌ కవర్‌ లేదా మూతపెట్టి, వేడిని పుట్టించాలి. అలా చేస్తే మూడు వారాల తర్వాత మొలకలు మొదలౌతాయి. వాటిని వేరు, వేరు కుండీల్లో, నేలమీదగానీ నాటి, కోలియాస్‌ మొక్కలు పెంచుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 340 రకాలు ఉన్నాయి. అయితే మన దేశంలో కేవలం 43 రకాలు లభ్యమౌతున్నాయి.

                                                                  ప్లైన్‌

  ప్లైన్‌

   ఈ కోలియాస్‌ మొక్కల ఆకులు ఒకే రంగులో ఉంటాయి. వీటిని దేశవాళీ కోలియాస్‌ అని కూడా పిలుస్తారు. వీటిలో ఆకుపచ్చ, నీలం, ఎరుపులాంటి రంగుల మొక్కలుంటాయి.


                                                                   ఫ్లోరోసెంట్‌

  ఫ్లోరోసెంట్‌


   ఈ కోలియాస్‌ మొక్క పత్రాలు ఫ్లోరోసెంట్‌ రంగులు అద్దినట్లుంటాయి. ఒక్కో ఆకు నెల నుంచి రెండునెలల వరకూ పాడవ్వకుండా ఉంటుంది. 

                                                                 హైబ్రీడ్‌

 హైబ్రీడ్‌

   ఒకే మొక్క రెండు రకాలుగా ఉంటుంది. మద్యభాగం మొక్క రంగు ఒకలాగా, చుట్టూతా ఉండే మొక్కభాగం ఒకలాగా ఉంటుంది. మొత్తానికి మొక్క చూడచక్కగా అందంగా ఉంటుంది.

                                                                  బోర్డర్‌

 బోర్డర్‌

   దీని ఆకులన్నీ ఒకే రంగులో ఉండి, చుట్టూతా ఉండే రంపపు పళ్ళులాంటి భాగం మాత్రం వేరే రంగులో ఉండి అబ్బురపరుస్తూ ఉంటుంది.

                                                                   మల్టీ

 మల్టీ

   పత్రాల మీద విభిన్నమైన రంగులు వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరి, చూడగానే ఆహా అన్నట్టు ఉంటుందీ మొక్క. కోలియాస్‌ మొక్కలంటే మల్టీ కలర్‌ కోలియాస్‌గా భావిస్తారు.

                                                             డయాగల్‌

డయాగల్‌


పత్ర శీర్షాల వెంబడి ప్రత్యేకమైన రంగుల చెక్స్‌ నయనానందంగా ఉంటాయి. వీటి ఆకు, మొక్కా వెరైటీగా ఉంటాయి.

- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506