Oct 25,2021 20:09

'కాక్టస్‌' మొక్కల పూలు, కాయలు గురించి మనలో చాలామందికి తెలియదు. పైగా ఇంటి పెరట్లో పూలమొక్కలను పెంచుకోవాలని ఇష్టపడే చాలామంది 'కాక్టస్‌' లాంటి ముళ్లమొక్కలను పెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఇంట్లో ఆ మొక్కలు పెరిగితే అరిష్టమన్న మూఢనమ్మకం కూడా చాలామందిలో బలంగా ఉంటుంది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒకటి, రెండు కాదు వందల రకాల కాక్టస్‌లను పెంచుతున్నాడు మచిలీపట్నానికి చెందిన యువకుడు మీథున్‌. విభిన్న రకాలను సంపర్కం చేసి కొత్తరకాలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడతని కాక్టస్‌ తోటలో ఎంతో అందమైన, అబ్బురపరిచే రంగురంగుల పూలు విరబూశాయి.
26 ఏళ్ల మీథున్‌కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. ఏదైనా అగ్రికల్చర్‌ కోర్సు చేయాలనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల ఫార్మసీ పూర్తిచేయాల్సివచ్చిందంటాడు. వ్యవసాయం వైపు అడుగులు వేయకపోయినా మొక్కలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ ఇష్టం మరింతగా పెరిగింది. కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చదువుకుంటూనే మొక్కలను పెంచసాగాడు. ఈ ప్రయాణంలో కాక్టస్‌ మొక్కలు అతనిని బాగా ఆకర్షించాయి. ప్రస్తుతం వాటి పెంపకం, పోషణ, విభిన్నరకాల అన్వేషణతో నిమిషం తీరికలేకుండా గడుపుతున్నాడు.

రంగుల హరివిల్లు
లబివియా, గిమ్నస్‌, కొరైఫంతా, వెరిగేట్‌డ్‌ సీరస్‌ వంటి వందల రకాలను మీథున్‌ సేకరించాడు. ఏ రకం గురించైనా మనం తెలుసుకోవాలనుకుంటే వాటి చరిత్ర అంతా ఇట్టే చెప్పేస్తాడు. దాని పేరు, ప్రత్యేకత ఏంటి? లక్షణాలు, ఎలా పెంచాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ వైరస్‌లు దానిపై ప్రభావం చూపుతాయి? కొన్ని నిర్దిష్ట సంవత్సరాలుగా దానిలో జరిగిన జన్యుమార్పులు వగైరా విషయాలన్నీ అతనికి తెలుసు. ఈ సమాచారమంతా ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించాడు. '2017 నుంచి కాక్టస్‌తో నా ప్రయాణం మొదలైంది. అప్పుడే ఫేస్‌బుక్‌ ద్వారా స్వీడన్‌లో ఓ మిత్రుడు పరిచయమయ్యాడు. అతనో చెఫ్‌. కాని కాక్టస్‌ గురించి అతనికి పూర్తి సమాచారం తెలుసు. తనకు తెలిసిన విషయాలన్నీ నాకు చెప్పేవాడు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు చాలా మెళకువలు ఆయన దగ్గరే నేర్చుకున్నాను' అంటున్న మిథున్‌ ఒక యూట్యూబ్‌ ఛానెల్‌లో 4 నిమిషాల వ్యవధిలో కాక్టస్‌ పెంపకంపై ప్రసారమైన ఒక వీడియో ప్రభావితం చేసిందంటాడు. 'ఐదేళ్లుగా వీటిని పెంచుతున్నాను. ఈ ప్రయాణంలో విజయం సాధించాను కూడా' అంటూ ఎంతో సంతోషంగా చెబుతాడు.

రంగుల హరివిల్లు
అందమైన పూలతో విరబూసిన కాక్టస్‌ మొక్కల పెంపకం అంత సులభం కాదు. ఒక్కోకాక్టస్‌ పువ్వు పూయడానికి రెండు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. ఆ పువ్వు 2 నుంచి 24 గంటలపాటు వికసిస్తూనే ఉంటుంది. అలా తన తోటలోని కాక్టస్‌ పుష్పించడాన్ని మిథున్‌ ఓ వేడుకలా భావిస్తాడు. కాక్టస్‌ల కంటే ముందు వాటర్‌లిల్లీల్లో 25 విభిన్న రకాలను పెంచాడు. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మిథున్‌ పసుపుపచ్చ పుచ్చకాయ పాదును కూడా పెంచాడు. ఇలా విభిన్నరకాల మొక్కలను సేకరించడం, సంరక్షించడంలో విజయం సాధిస్తూ తన అభిరుచితో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. మొక్కలపెంపకంలో తల్లి, తమ్ముడు అతనికి సాయంగా ఉంటారు. ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న మిథున్‌ తన మొక్కల సేకరణ కోసం విదేశీ విద్యను వాయిదా వేసుకున్నాడు. 'అరుదైన కాక్టస్‌ మొక్కల ఆన్‌లైన్‌ నర్సరీని ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు వేసుకున్నాను. భవిష్యత్తులో వీటిపై అపోహలు పోయి ప్రతిఒక్కరూ వీటిని సంరక్షించే రోజులు రావాల'ని మిథున్‌ అంటున్నాడు.