Apr 14,2021 20:40

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ను అంతం చేయడం అసాధ్యమని, రక్షణ చర్యలతోనే వైరస్‌ను కట్టడి చేయగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గబ్రేయేసస్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్‌ డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్లు అందచేశామని, అయినా మహమ్మారి విస్తరిస్తోందని, మరోవైపు రక్షణ చర్యలతోనే వైరస్‌ను నియంత్రించగలమని నిరూపితమైందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 13,65,00,400 మందికిపైగా వైరస్‌ బారిన పడగా, 29,44,500 మందికిపైగా మరణించారని ఆయన తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలో వరసగా ఆరు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం వరసగా ఏడు వారాల నుంచి కేసుల సంఖ్య, నాలుగు వారాల నుంచి మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.