Nov 30,2020 00:28

రక్షిత మంచి నీటి పథకం ద్వారా వస్తున్న బురద నీరు

ప్రజాశక్తి-రోలుగుంట
రోలుగుంట మండల కేంద్రంలోని రక్షిత మంచినీటి పథకం నుంచి వచ్చే నీరు బురదమయంగా ఉంటున్నా అధికారులు పట్టించుకోలేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవిందరావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి విమర్శించారు. రోలుగుంట, కొవ్వూరు, కె.నాయుడుపాలెం, నిండుగొండ, కొత్తూరు, అంట్లపాలెం గ్రామాలను 2008 సంవత్సరంలో ఫ్లోరైడ్‌ గ్రామాలుగా గుర్తించారని వారు తెలిపారు. 15వేల మంది జనాభా నీటి కోసం ఇబ్బందులు పడుతుండటంతో 2008 సంవత్సరంలో జానకిరాంపురం వద్ద వరాహనదిలో భారీ రిగ్గులు, బోర్లు తవ్వి రోలుగుంట గ్రామంలో లక్ష లీటర్ల సామర్ధ్యం గల వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు నీరు సరఫరా అవుతోందని తెలిపారు. భారీ వర్షాలు వస్తే ఈ పథకం నుంచి బురద నీరే వస్తుందన్నారు. ఈ నీరు తాగి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2016 సంవత్సరంలో రూ.25 లక్షలతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరిగినా, నేటికి ప్రారంభించకుండా వదిలేయడంతో మూలకు చేరిందన్నారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ని వినియోగంలోకి తీసుకొచ్చి మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్‌చేశారు.