May 04,2021 09:24

న్యూఢిల్లీ : కోర్టుల్లో జరిగే విచారణ, న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను నివేదించకుండా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మీడియా అనేది శక్తివంతమైనదని, న్యాయస్ధానాల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. జడ్జిలు చేసే వ్యాఖ్యలకు సంబంధించి మీడియా చేసే నిజాయితీతో కూడిన పూర్తిస్థాయి రిపోర్టింగ్‌ను చూసే తమ సమస్యల పరిష్కారానికి న్యాయమూర్తులు మనసు పెట్టి ప్రయత్నిస్తున్నారా లేదా అని ప్రజలు అభిప్రాయానికి వస్తారని తెలిపింది.
   దేశంలో కోవిడ్‌-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, ఇసి అధికారులపై హత్య కేసు కూడా నమోదు చేయవచ్చునని ఇటీవల మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఎన్నికల సంఘం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. కోర్టు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, ఆ వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాను నియంత్రించాలని కోరుతూ ఇసి మొదట హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు గతనెల 30న తిరస్కరించడంతో ఇసి సుప్రీంకోర్టుకు వెళ్లింది.
   కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా పౌరులకు పట్టింపు ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనల్ని మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమని తెలిపింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌ విజృంభణకు సంబంధించి సంబంధిత విపత్తు నిర్వహణ అధికారుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే, ఎన్నికల సంఘానికి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే నిందిస్తున్నారని తెలిపింది. దీనికి కోర్టు స్పందిస్తూ ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది.