Nov 29,2021 13:54

అమరావతి :  ఎపిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వై ఎస్ ఆర్  కడప జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆరెంజ్‌ అలర్ట్‌ చేసింది. భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇది 29వ తేదీన ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనావేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం బ్యాంకాక్‌ సమీపంలో ఉండడంతో అండమాన్‌ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఎపిలో వచ్చే నెల 3 నుండి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో మదురై, విరుదునగర్‌ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.