Nov 19,2020 19:16

హైదరాబాద్‌ బ్యూరో : జిహెచ్‌ఎంసి ఎన్నికల వేళ హైదరాబాద్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పూర్తిస్థాయిలో శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. గ్రేటర్‌ పోలింగ్‌కు కేవలం పది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్షాల సర్దుబాటుకు ఎక్కువ సమయం ఇవ్వకుండా అధికార పార్టీ ఇరుకునపెట్టడంతో ఈ ఎన్నికల్లో పొత్తులకు పెద్దగా అవకాశం లేకపోయింది. ఒంటరిగానే పోటీచేస్తున్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నా..కొన్ని పార్టీలు అంతర్గతంగా రాజకీయ అవగహనకు వస్తున్నాయి.

గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో ఒక అవగహనకు వచ్చి మొత్తం 150 డివిజన్లలో పోటీచేసింది. పాతబస్తీ పరిధిలో టిఆర్‌ఎస్‌కు బలం ఉన్న చోట మజ్లిస్‌ డమ్మీ అభ్యర్ధులను పోటీలో నిలపగా, మజ్లిస్‌కు బలం ఉన్న చోట టిఆర్‌ఎస్‌ కూడా అదే విధానం అమలుచేసింది. దీంతో రెండు పార్టీలు ముందుగా చేసుకున్న రాజకీయ ఒప్పందం విజయవంతమైంది. ఈసారి కూడా ఇదే ప్లాన్‌తో టిఆర్‌ఎస్‌,ఎంఐఎం ఎన్నికలకు వెళుతున్నాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి కెటిఆర్‌ ఎంఐఎంతో పొత్తులేదని ప్రకటించినా..క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో ఊపుమీదున్న బిజెపి గ్రేటర్‌ పీఠంపై దృష్టిపెట్టింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకోవడంలో కమలం నేతలు విజయం సాధించారు.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల ప్రపుల్‌ రాం రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి, రేవంత్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు కొప్పుల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌, తదితరులను తమ గూటికి తీసుకురావడంలో బిజెపి సక్సెస్‌ అయింది. అభ్యర్ధుల ఎంపికలో కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏ ఇక్క అవకాశాన్ని ఆపార్టీ నేతలు వదులుకోవడంలేదు. తొలిసారిగా గ్రేటర్‌ పోరులో తలబడుతున్న జనసేన పార్టీతో కలిసి వెళతారనే ప్రచారం జరిగినా..ఒంటరిగానే తలపడుతున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు గురువారం ప్రకటించారు. అయితే, బిజెపి-జనసేన మధ్య రహస్య రాజకీయ ఒప్పందం ఉందని, ఆయా స్థానాల్లో బిజెపికి మేలు చేసేందుకే జనసేన బరిలోకి దిగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోకున్నా..గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఆపార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. గ్రేటర్‌ పరిధిలోని శివారు మున్సిపాల్టీల్లో కూడా కాంగ్రెస్‌కు మెరుగైన ఫలాతాలు రావొచ్చు.
ఎపి స్థానికత కలిగిన ప్రజలు అధికంగా ఉన్న డివిజన్లలో అభ్యర్ధుల ఎంపికపై అధికార టిఆర్‌ఎస్‌, బిజెపి,కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేకదృష్టి సారించాయి. ఎక్కువ ప్రభావితం చూపే సామాజిక వర్గానికి చెందిన నాయకులకే టిక్కెట్లు కేటాయించారు.