May 15,2021 22:37

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
హైదరాబాద్‌లో శుక్రవారం అరెస్టు చేసిన నర్సాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు శనివారం సాయంత్రం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించింది. భాగంగా సిఐడి అధికారులు తనను తీవ్రంగా కొట్టారని విచారణ ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంపి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కాళ్‌లకు అయిన గాయాలను జడ్జి కె. అరుణకు చూపారు. జడ్జి సూచన మేరకు అక్కడికక్కడే నాలుగు పేజీల ఫిర్యాదును రాసి ఇచ్చారు. దీంతో గాయాలు మానేంతవరకు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి జడ్జి అనుమతి ఇచ్చారు. అంతకుముందు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సెషన్స్‌కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో సిఐడి పోలీసులు రఘురామకృష్ణంరాజును గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. ఆయనపై సామాజిక తరగతులను, వర్గాలను కించపర్చడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, అధికారంలో ఉన్న వ్యక్తులను అవమానించడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు . రఘురామకృష్ణరాజుకు సహకరించాయని అభియోగం మోపుతూ టివి-5, ఎబిఎన్‌పై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎ-2 ముద్దాయిగా టివి-5ని, ఎ-3 ముద్దాయిగా ఎబిఎన్‌ను పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టినట్టు రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు రాసి ఇచ్చిన తువాత ఆయన తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తరువాత ఎంపి రఘురామకృష్ణంరాజు కాళ్లకు ఉన్న గాయాలను జడ్జి పరిశీలించారు. ఆయన ఫిర్యాదును చదివి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాలని ఆదేశించారు. తాను ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లబోనని, అక్కడంతా కరోనా రోగులు ఉన్నారని కోర్టుకు ఎంపి విన్నవించారు. దీంతో, కోర్టు తొలుత ప్రభుత్వాస్పత్రికి, ఆ తర్వాత ప్రయివేట్‌ ఆస్పత్రి అయిన రమేష్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. అంతకుమందు సాంకేతిక అంశాలపై రిమాండ్‌ రిపోర్టును మార్చి తీసుకురావాలని అధికారులను జడ్జి ఆదేశించారు. మార్పులు చేసి మళ్లీ అధికారులు దాఖలు చేశారు. ఎంపి తరుఫున న్యాయవాదులు సిహెచ్‌.రమేష్‌, లక్ష్మీనారాయణ, ఎం.సురేష్‌ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎవరు సహకరిస్తున్నారు ...?
శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు రఘురామకృష్ణంరాజును గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో అదనపు డిజిపి పి.వి.సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సిఐడి అధికారులు విచారించారు. ఆయనకు ఎవరు సహకరిస్తున్నారు? సాంకేతిక సమాచారం ఎవరు అందిస్తున్నారు? అనే అంశంపై సిఐడి అధికారులు విచారణలో ప్రశ్నించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, అసాంఘికశక్తులను రెచ్చగొట్టే విధంగా ప్రవరిస్తున్నారని, నేరపూరిత కుట్రలకు పాల్పడుతున్నారని పలు సెక్షన్ల కింద రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు. సింగిల్‌ జడ్జి బెయిల్‌ను తిరస్కరించడంతో డివిజన్‌బెంచ్‌ ముందు రఘురామకృష్ణంరాజు తరపు నాయయవాదులు పిటిషన్‌దాఖలు చేశారు.
రఘురామకృష్ణరాజు అరెస్టుకు సిపిఎం, సిపిఐ ఖండన :
రఘురామకృష్ణరాజు అరెస్టును సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు వేర్వేరు ప్రకటనల్లో ఖండించింది. అధికార పార్టీలో రాజకీయ వివాదాల్ని పరిష్కరించుకోవడానికి చట్టాల దుర్వినియోగం సరైంది కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ఇది వ్యతిరేకమని తెలిపారు. రఘురామకృష్ణరాజును విడుదల చేసి కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లసుగులను ఆసరా చేసుకుని రఘురామకృష్ణరాజును పావుగా బిజెపి వాడుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేస్తోన్న బిజెపి వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే రఘురామకృష్ణరాజు చర్యలు తోడ్పడుతున్నాయని తెలిపారు. ఎంపిని అరెస్టు చేయించి తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదనే సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు పెను విఘాతమని పేర్కొన్నారు.