Jun 13,2021 08:00
  • అడ్మినిస్ట్రేటర్‌పై వామపక్ష ఎంపిల హక్కుల నోటీసు
  • స్థానిక బిజెపి నేతల రాజీనామా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో, కొచ్చి : లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ నిరంకుశ విధానాలకు ప్రతిఘటన అంతకంతకూ తీవ్రమవుతోంది. తమ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని, అగౌరవపరిచారని వామపక్ష ఎంపీలు ప్రఫుల్‌కు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సినీ నిర్మాత, దర్శకురాలు ఆయేషాపై రాజద్రోహం కేసు మోపడాన్ని నిరసిస్తూ బిజెపికి చెందిన పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభలో వామపక్ష ఎంపిలు ఎలమరం కరీం, బినరు విశ్వం, ఎంవి శ్రేయామ్స్‌ కుమార్‌, వి.శివదాసన్‌, కె. సోమప్రసాద్‌, జాన్‌ బ్రిటాస్‌ రాజ్యసభ రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూల్‌ 187 కింద నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోని ఎఎం ఆరిఫ్‌, థామస్‌ చాజిక్కాదన్‌ లోక్‌సభలో రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూల్‌ 222 కింద నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిపాలనాధికారి ప్రఫుల్‌ పటేల్‌ లక్షద్వీప్‌ ప్రజల హక్కుపై దాడి, సహజ వనరుల ప్రైవేటీకరణ, పర్యావరణాన్ని నాశనం చేసే చర్యలపై నిజ నిర్ధారణకుగాను లక్షద్వీప్‌ను సందర్శించేందుకు వెళ్లిన ఎంపీలను పాలనాధికారి ప్రఫుల్‌ అడ్డుకున్నారు.. కరోనా ఆంక్షలను సాకుగా చూపారు. మళ్లీ రెండోసారి అభ్యర్థన లేఖ రాసినా పరిపాలన అధికారి స్పందించలేదు. ఈ చర్యల ద్వారా ఆయన దుష్ప్రవర్తన స్పష్టంగా తెలుస్తోందని, మొత్తం పరిపాలన ఆయన ఆదేశాల ప్రకారం నడుస్తుందని ఎంపీలు పేర్కొన్నారు.
 

                                   సుల్తానాపై రాజద్రోహం కేసును నిరసిస్తూ.. బిజెపికి నేతల రాజీనామా

   లక్షద్వీప్‌కు చెందిన సినీనిర్మాత ఆయేషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపికి చెందిన 15 మంది నేతలు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిజెపి లక్షద్వీప్‌ శాఖ అధ్యక్షుడు అబ్ధుల్‌ ఖాదిర్‌కు పంపించారు. బిజెపికి గుడ్‌బై చెప్పిన వారిలో ఆ పార్టీ లక్షద్వీప్‌ శాఖ ప్రధాన కార్యదర్శి అబ్ధుల్‌ హమీద్‌ ముల్లిఫుజా, వక్ఫ్‌బోర్డు సభ్యుడు ఉమ్ముల్‌ కులూస్‌ పుతియపుర, ఖాదీ బోర్డు సభ్యులు సైఫుల్లా పక్కియోడ, చెత్లాట్‌ యూనిట్‌ కార్యదర్శి జబ్బీర్‌ సాలిహత్‌ మంజిల్‌తో పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఒక టివి డిబేట్‌లో సుల్తానా లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ను మోడీ ప్రభుత్వం ప్రయోగించిన జీవ ఆయుధం అని వ్యాఖ్యానించారు.
    ఇందుకుగాను ఆమెపై బిజెపి లక్షద్వీప్‌ శాఖ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయేషాపై రాజద్రోహం కేసు పెట్టడం పూర్తిగా తప్పు, ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని బిజెపి నేతలు తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.