
ప్రజాశక్తి-లింగసముద్రం: ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో ఆయన సమస్యల పరిష్కారానికి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు భూసమస్యల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిబ్బంది నిర్లక్ష్యంతో సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. గ్రామాల్లో సరైన రికార్డుల్లేక పోవడం, ఉన్న రికార్డులను అధికారుల వద్దే పెట్టుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలే ఈ సమస్యల కు కారణమని అన్నారు. గతంలో పనిచేసిన తహశీల్దార్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రంథాలయాన్ని ఆక్రమించుకుని నిర్మాణ ం చేపట్టారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఆర్.బ్రహ్మయ్య, ఎంపిడిఒ కె.మాలకొండయ్యకు చెప్పారు.
కోవిడ్ నిధులతో పశువైద్యశాలలకు మందులు
కందుకూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని పశువైద్యశాలకు కోవిడ్ నగదుతో అత్యవసర మందులు కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. పశువైద్యశాలల్లో మందులు లేక పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశక్తి ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. అన్ని వైద్యశాలల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో విరాళా లుగా వచ్చిన నగదు నుండి నియోజకవర్గంలోని వైద్యశాలకు మందులు పంపిణీ చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా పశువైద్యశాఖ డిడి చంద్రశేఖర్, ఎడి బ్రహ్మయ్య ఎమ్మెల్యేను కలిసి పరిస్థితిని వివరించారు. అత్యవసరంగా కావాల్సిన మందుల వివరాలిస్తే వెంటనే తెప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, వైపిసి నాయకులు ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, రామిశెట్టి మాలకొండయ్య, వెంకటప్పనాయుడు, కేశంరెడ్డి క్రిష్ణారెడ్డి, మాచేపల్లి మాల్యాద్రి, ఎందోటి పెద్ద మాల్యాద్రి, వంకాయపాటి వెంకటేశ్వర్లు, సూరం కొండారెడ్డి, నోటి వెంకటేశ్వరరెడ్డి, డబ్బుగొట్టు మాధవ, బక్కముంతల ఓంకారం, మైలా కేశవరావు, రంగయ్య, అల్లం రాజేశ్ పాల్గొన్నారు.