Jan 18,2021 07:28

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో రోజు 17 వేల మందికి పైగా టీకాలు వేశారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకు 2.24 లక్షల మంది ఒక్క మోతాదులో వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరిగిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా తొలి రోజు 3,006 ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైవ్‌లో 1.19లక్షల మందికి టీకా అందించారు. సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వారంలో నాలుగు రోజుల పాటు కోవిడ్‌ టీకా కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించామని, ఆదివారం కావడంతో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ మనోహర్‌ అగ్నాని తెలిపారు. చాలా రాష్ట్రాలు వారానికి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని భావించగా..గోవా, ఉత్తరప్రదేశ్‌ రెండు, మిజోరాం ఐదు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని తెలిపారు. ప్రతికూల ప్రభావం చూపిన వాటిపై స్పందించేందుకు ప్రొటోకాల్‌ ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వికారం, వాంతులు, ఇంజెక్షన్‌ చేసిన చోట వాపు ఉండటం సహజమని తెలిపింది. ఇప్పటి వరకు అలాంటివి 447 కేసులు తమ దృష్టికి వచ్చాయని, వీరిలో ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారిలో ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ కాగా, మరొకరిని రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఆబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వెల్లడించింది.